వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కాబట్టి ప్రజలు కూడా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. వైఎస్ జగన్ నిరంతరం పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశాడని ఆరోపించారు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదని చెప్పుకొచ్చారు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్ రాష్ట్రానికి కావాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 2024లో పేదలకు-పెత్తందారులకు ఎన్నికలు జరుగుతున్నాయని పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది వైఎస్ జగనే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
pspk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆదివారం తదుపరి ఉమ్మడి కార్యచరణను ప్రకటించనున్నారని సమాచారం. పొత్తుకు సంబంధించి శనివారం రాత్రి జనసేనాని పవన్ కల్యాణ్ నివాసంలో కీలక చర్చలు జరిగాయి. ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విజయానికి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జనసేన ఏయే నియోజకవర్గల్లో పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఆదివారం వెల్లడించనున్నారని సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణకు వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని కోరగా పవన్‌కల్యాణ్ సానుకూలంగా స్పందించారని బీజేపీ వెల్లడించింది.ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గతంలో అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించిందని, ఈ ఎన్నికల్లో జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుండగా జనసేన 9 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఏయే స్థానాల్లో బరిలోకి దిగబోతోందనేది త్వరలోనే వెల్లడికానుంది. మరోవైపు బీజేపీ ఇప్పటికే ఇప్పటికే 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 9 నియోజకవర్గాలను మినహాయించగా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం అని జనసేన అధినేత ట్వీట్ చేశారు.