టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు. జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని… మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు ఈ దుర్మార్గులు హాని కలిగించే వారని అన్నారు. కొన్ని గంటల్లో చంద్రబాబు జైలు నుంచి బయటకు రానున్నారని చెప్పారు. తనపై కూడా ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ 16 నుంచి 18 కేసులు పెట్టించాడని మండిపడ్డారు. తాను విడుదలైన తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకున్నానని… అయితే, ఆ దేవున్ని కూడా తనకు ఈ ముఖ్యమంత్రి దూరం చేశాడని అన్నారు. చంద్రబాబు విషయంలో న్యాయమూర్తి ద్వారా వెంకటేశ్వరస్వామి న్యాయాన్ని పలికించారని రఘురాజు చెప్పారు. వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శనం చేసుకుని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, నూతనోత్తేజంతో మళ్లీ ప్రజల మధ్య అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనను బాధ పెట్టిన అందరినీ రాజకీయంగా కడతేర్చాలని కోరుకుంటున్నానని చెప్పారు. వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని… తాను తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేక అమెరికాలోని వెంకటేశ్వరస్వామి దేవాలయాన్నీ తిరిగానని అన్నారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెంకన్న ఆలయాలన్నీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను ఏపీలోకి ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ముందే ఊహించే… లిక్కర్ కేసులో ఆయనపై మరో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ నాలుగు వారాల్లో చంద్రబాబును ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేరని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన ఐదు కేసులూ రెడ్లు పెట్టారని విమర్శించారు. కేసులు కట్టేది కూడా రెడ్డేనని, మధ్యలో కథ నడిపించేందరి సజ్జల రామకృష్ణారెడ్డి అని, పైనుంచి నడిపించేది జగన్ రెడ్డి అని అన్నారు. రెడ్లు తప్ప మరెవరూ లేరని… ఈ విషయాన్ని చెప్పడానికి తాను సంకోచించనని చెప్పారు.
ycp
పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. కిలారు తన నియోజకవర్గాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని మండిపడ్డారు. కౌలుకు తీసుకొని, ఎకరాకి రూ.30 వేలు ఖర్చు పెట్టి వేసిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే రైతుల కోసం ఏమీ చేయడంలేదంటూ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏమీ చేయలేరని, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కిలారు వెంకట్రావు పొన్నూరు నియోజకవర్గాన్ని ఏటీఎం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిని, నియోజకవర్గాన్ని ఆయన ఎనీటైమ్ మనీగా మార్చుకున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని పాడి గేదె లాగా మార్చారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. డబ్బులు దండుకోవడం తప్పితే ప్రజల బాధలు ఆయనకు పట్టవని వ్యాఖ్యానించారు. ప్రజల బాధలు కలెక్టర్‌కు పట్టవని, ముఖ్యమంత్రి కూడా పట్టవని ఆరోపించారు. టీడీపీ హయంలో ఈ ప్రాంతంలో పంటలను కాపాడడానికి రూ.53 కోట్లతో ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. కానీ నేడు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. అధికారం ఇస్తే రైతు సమస్యలు పరిష్కారం చేయకపోగా, వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తామని జగన్ కు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రవీంద్ర పేర్కొన్నారు. జగన్ అనే వైరస్ కు జనసేన, టిడిపి సరైన వ్యాక్సిన్ అని చెబుతున్న రవీంద్ర తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. దొడ్డిపల్లిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిపై ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మండల సర్వేయర్ పైన ఒత్తిడి తెచ్చారు. సర్వేయర్ రెడ్డప్ప ఈ భూమి కోర్టులో ఉన్నందువల్ల సర్టిఫికెట్ ఇవ్వలేనన్నారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ కార్యాలయానికి వచ్చి నాయకులు కంభం అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. దీంతో సర్వేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ సమాధి అవుతారని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. తన వ్యాఖ్యలు టీడీపీ వాళ్లకు తప్పుగా అనిపిస్తున్నాయని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… “2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు భగ్గుమన్నాయి. చంద్రబాబును అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పడానికి ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. తాను అన్న వ్యాఖ్యలను మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉచ్చారణ దోషం వల్ల టీడీపీ వాళ్లకు అలా అనిపించి ఉండొచ్చని తెలిపారు. చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుగా ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
ఇచ్చాపురం నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. గురువారం.. ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తా మన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించామన్నారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనగ పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి పాల్గొన్నారు.
నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నేతల దోపిడీ విధానాలను వివరిస్తూ..తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదుల అనుసంధానంతో..నీటిని మరొకప్రాంతానికి తరలించుకునే అవకాశం ఉన్నప్పటికీ..ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఏడాదికి మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్నారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పూర్తయినా..నీటిని తెచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఏ కోశానా చేయడంలేదన్నారు.జిల్లాలోని మెట్టప్రాంతాలు నీటి కోసం వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వైకాపా పాలనలో రైతుల గోడును తీర్చే నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు.కొసమెరుపుగా మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై సెటైర్స్ వేశారు. సైదాపురం అక్రమ మైనింగ్ అంతా టిడిపి నేతలదే అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అనీల్ యాదవ్ తాను కూడా తన మనుషుల ద్వారా అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరిపినది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు
పల్నాడు జిల్లా , గురజాల మండలం ,జంగమహేశ్వరపురం గ్రామంలో జరిగిన కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈసందర్బంగా యరపతినేని మాట్లాడుతూ..మహేష్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 11 మంది చనిపోయారని, కాసు మహేష్ రెడ్డి చేసే అక్రమ మైనింగ్ వల్ల ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారని అన్నారు. మహేష్ రెడ్డి ఓటమి అంచున ఉన్నారని రాబోయే ఎన్నికలలో తనను ఢీకొనలేకనే తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మవారిని పూజిస్తారని, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు… దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యతని మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పురుగు మందు డబ్బా తీసుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన ఇవాళ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మోత్కుపల్లి మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారు. ఆయన్ను హింసించి బాధపెడుతున్నారు. జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం.. జగన్. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదు. ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారు. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను సాధించాలని ప్రయత్నమా? ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి జగన్ మళ్లీ గెలవాలని చూస్తున్నారు అని మోత్కుపల్లి మండిపడ్డారు.