ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ -2 కొనసాగుతోంది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. భారీగా ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
బీజాపూర్, ములుగు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. దాదాపు 2 వేల మంది కోబ్రా బలగాలు మావోయిస్టుల ఏరివేత కోసం తడపాల, డోలి పరిసర అటవీ ప్రాంతాలతో పాటు కర్రె గుట్టలపై కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం, గురువారం తెల్లవారు జామున రెండు సార్లు మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేకపోవడంతో అక్కడి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావడం లేదు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు కానీ ముఖ్య నాయకుడు కానీ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జి కేసా సోధి కోసం 2 వేల మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2024లో మావోయిస్టుల కోసం భారీ ఆపరేషన్‌లను చేపట్టింది. సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, సీఏఎఫ్ సంయుక్త బలగాలు గత ఏడాది ఏప్రిల్ నెలలో 21 రోజుల పాటు కర్రెగుట్టల్లో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక్కడినుంచి మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ తప్పించుకుంది. ప్రస్తుతం కర్రెగుట్టల్లోని తడపల, పామునూరు, మురుమూరు, డోలీ వంటి ప్రాంతాల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్)లను ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ బలగాలు నిత్యం ఆపరేషన్ చేపడుతున్నాయి. తాజాగా చేపట్టిన ‘కేజీహెచ్-2’ సైతం అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్‌గా భావిస్తున్నారు