మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను హైకోర్టు నిలిపివేసింది. ఆ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు, ఇతర అధికారులపై ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కమిషన్ విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, ముఖ్యంగా Sections 8B, 8C నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండానే నివేదిక రూపొందించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్.కె. జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ సంయుక్త తీర్పు వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైనింగ్ మరియు నిర్మాణంలో జరిగిన లోపాలపై జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కేసీఆర్ను బాధ్యునిగా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రిపోర్టును, విచారణా తీరును సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు మరికొందరు ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే వాదనలు పూర్తి చేసుకున్న ఈ కేసుపై హైకోర్టు బెంచ్ ఈరోజు తన తుది తీర్పును వెలువరించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ విచారణ సాగిందని కేసీఆర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ క్రమంలో కమిషన్ ఇచ్చిన కొన్ని అంశాలపై స్టే ఇవ్వడం లేదా నివేదికలోని కొన్ని అభ్యంతరకరమైన భాగాలను కొట్టివేయడం ద్వారా కేసీఆర్ కు ఊరట లభించింది.