Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh బస్ స్టేషన్ సౌకర్యం లేక ప్రయాణికులకు ఇబ్బందులు..

బస్ స్టేషన్ సౌకర్యం లేక ప్రయాణికులకు ఇబ్బందులు..

by CVR NEWS

పల్నాడు జిల్లా దాచేపల్లి… ఒకప్పుడు రద్దీగా కిటకిటలాడిన బస్ స్టేషన్ … ఇప్పుడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. దాదాపు 16 గ్రామ పంచాయతీలకు కేంద్రంగా ఉన్న దాచేపల్లి లో నిత్యం వందలాది మంది ప్రజలు పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉండడంతో ఈ బస్ స్టేషన్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది . కానీ ప్రస్తుతం బస్సులు బస్ స్టేషన్ లోకి రాకపోవడం, సరైన వసతులు లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపైనే ఎండలో నిలబడి ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. అసలే ఎండా కాలం ..ప్రయాణికులకు నిలువ నీడ లేకపోవడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది . బస్ స్టేషన్ ఎదుట ఉన్న బ్రిడ్జి కారణంగా బస్సులు లోపలికి రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రయాణికులతో సందడితో కళకళలాడిన ఈ ప్రదేశం… ఇప్పుడు ముళ్ళ చెట్లతో నిండిపోయి పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది.మరో వైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది .

దాచేపల్లి బస్టాండ్‌లో ఉన్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బస్ స్టేషన్ ప్రాంగణం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ముళ్ళ చెట్లతో నిండిపోవడం, చెత్తాచెదారంతో మురికి కూపంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా టాయిలెట్ సదుపాయం లేకపోవడం మహిళలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఉన్న టాయిలెట్లకు తలుపులు కూడా లేకపోవడంతో అవి వాడుకకు పనికిరాని స్థితిలో ఉన్నాయి. దీంతో మహిళలు అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రదేశం పిల్లలు ఆడుకునే స్థలంగా మారిపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతుంది . 16 గ్రామాల ప్రజలు నిత్యం ఈ మండల కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో కనీస సౌకర్యం కూడా లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయాలతో నిర్మించిన బస్ స్టేషన్ ఎలా నిరుపయోగంగా మారడంపై ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి . ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్ స్టేషన్ ను పునరుద్ధరించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: