Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home International హ‌ర్మూజ్‌పై పట్టు మాదేనన్న ట్రంప్‌…

హ‌ర్మూజ్‌పై పట్టు మాదేనన్న ట్రంప్‌…

by CVR NEWS
ఎట్టకేలకు తెరుచుకున్న హర్మూజ్ జలసంధి

హ‌ర్మూజ్ జలసంధి తమ పూర్తి నియంత్రణలో ఉందని, ఇరాన్‌తో తుది ఒప్పందం కుదిరే వరకు సముద్ర దిగ్బంధం ఎత్తివేసేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ దిగ్బంధం అద్భుత విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. అయితే, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, అమెరికా ఆంక్షలను దాటుకుని ఇరాన్‌కు చెందిన డజన్ల కొద్దీ నౌకలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ నెల‌ 13న అమెరికా దిగ్బంధం విధించినప్పటి నుంచి ఇరాన్‌కు సంబంధమున్న కనీసం 34 ట్యాంకర్లు హ‌ర్మూజ్ జలసంధిని దాటాయి. వీటిలో 19 ట్యాంకర్లు గల్ఫ్ నుంచి బయటకు వెళ్లగా, మరో 15 గల్ఫ్‌లోకి ప్రవేశించాయి. బయటకు వెళ్లిన వాటిలో ఆరు నౌకలు సుమారు 10.7 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీని ద్వారా ఇరాన్‌కు దాదాపు 910 మిలియన్ డాల‌ర్ల‌ ఆదాయం సమకూరినట్లు అంచనా. ఇప్పటివరకు అమెరికా దళాలు కేవలం ఒక కంటైనర్ షిప్‌ను అదుపులోకి తీసుకుని, 28 నౌకలను వెనక్కి పంపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా నిఘా నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ నౌకలు అత్యాధునిక పద్ధతులు వాడుతున్నాయి. ‘డొరెనా’ అనే ఇరాన్ సూపర్‌ట్యాంకర్ తన ఉనికిని, లొకేషన్‌ను తెలిపే ట్రాన్స్‌పాండర్‌ను ఆపివేసి జలసంధిని దాటింది. ఆ తర్వాత మలేషియా తీరంలో మరో నౌకలోకి చమురును మార్పిడి చేసి, దాని మూలాలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది. గతంలో అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న ‘మురళీకిషన్’, ‘అలీసియా’ వంటి ట్యాంకర్లు కూడా ఈ దిగ్బంధనాన్ని దాటి గల్ఫ్‌లోకి ప్రవేశించాయి.

మరోవైపు ఇరాన్ కూడా ప్రతివ్యూహాలు రచిస్తోంది. హ‌ర్మూజ్ జలసంధి నియంత్రణ తిరిగి తమ చేతికి వచ్చిందని, జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక తమ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. పౌర నౌకలకు ప్రత్యేక మార్గాన్ని నిర్దేశిస్తూ, సైనిక నౌకల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ఇటీవల ఇరాన్ దళాలు ఫ్రాన్స్, భారత్‌కు చెందిన నౌకలపై కాల్పులు జరపడం ఉద్రిక్తతలను పెంచింది. ఈ పరిణామాలతో నౌకల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ విధించిన ‘డబుల్ దిగ్బంధం’గా మారిందని వాపోతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: