Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడీ..

బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడీ..

by CVR NEWS
బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడీ

బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ శైలి విభిన్నం. పదిహేనేళ్ల పాటు నిరాటంకంగా ఏలిన ఆమె సీఎం కుర్చీని వీడటానికి సుముఖంగా లేదు. ఆమె కుర్చీకి అతుక్కుపోవాలని చూస్తున్నారు. తన పదవికి రాజీనామా చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. గౌరవంగా రాజీనామా చేయకుండా మొండికేస్తున్న ఆమెపై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలాలు వెల్లువెత్తుతున్నాయి.

టీఎంసీ ఓడిపోయిన మరుసటి రోజే కోల్ కతాలోని టీఎంసీ పార్టీ ఆఫీసును స్థానికులు, వ్యాపారులు కలిసి బుల్డోజర్ తో కూల్చివేశారు. ఓ దుకాణదారుడి నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కుని, అక్కడ యూనియన్ ఆఫీసు కట్టారంటూ స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు బుల్డోజరుతో కూల్చివేశారు.పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని న్యూ మార్కెట్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాల్సి వచ్చింది.

తాజాగా ఈసీ ‘కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూ అసెంబ్లీ’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఆమెకు ఊహించని షాకేనని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి పదవి గవర్నర్ ఆమోదం ఉన్నంత వరకు మాత్రమేనని తెలిసినా మొండిగా వ్యవహరించటం పట్ల రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అమిత్ షా వంటి అగ్రనేతల పర్యవేక్షణలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక , ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన బీజేపీ నూతన ప్రభుత్వం కొలువుదీరాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని దాదాపు ఖరారుచేసింది. అమిత్ షా అధికారికంగా ప్రకటించటమే తరువాయి. రెండు చోట్ల మమతను ఓడించి పార్టీలో తిరుగులేని నేత‌గా ఆవిర్భవించిన సువేందు అధికారి సీఎం పీఠం వైపు అడుగులు వేస్తున్నారు.

ఇదిలావుండగా సీఎం మమతా బెనర్జీ వ్యవహారశైలిని పలువురు ప్రముఖలు తూర్పారపడుతున్నారు. తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ప్రవర్తన క్షమించరానిదని, ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా తీవ్రంగా స్పందించారు. మమత వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. ఆమె రాజీనామా చేయకపోతే, బర్తరఫ్ చేయడమే ఏకైక మార్గమని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు ఆమెను, ఆమె తప్పులను చాలాకాలంగా సహించారన్నారు. ఏదిఏమైనా మమతా బెనర్జీ మడత పేచీ నేపథ్యంలో.. ఇప్పుడు ఏం జరుగుతుంది, బెంగాల్ గవర్నర్ ఏం చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: