రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జరిగే బాగోతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ జరిగినన్ని వింతలు ఇంకెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లా కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దీనికి మినహాయింపేమీ కాదు. దొరికితే దొంగ… దొరకకపోతే దొర అన్నట్లుగా ఉంది ఇక్కడి అధికారుల పరిస్థితి. ఒకరి పేరు మీద ఉన్న భూమిని.. ఎలాంటి సమాచారం లేకుండానే ఇంకొకరి పేరు మీద రిజిస్టర్ చేసేశారు. సర్వేనంబర్ 1241 బై 1 లో ఉన్న 384 గజాల స్థలం… నిజానికి అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి పేరు మీద ఉంది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు ఆయన దగ్గరున్నాయి. కానీ.. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ… కోట సబ్ రిజిస్ట్రార్ ఈ భూమిని అట్ల సాయికుమార్ పేరు మీద రిజిస్టర్ చేసేశారు. అలా ఎలా చేశారు అని అడిగితే… ఖాళీ స్థలాలు VRO నివేదికల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెబుతున్నారు..
ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రోడ్డుకు దగ్గరగా ఉండే ఈ భూమి విలువ ఇప్పుడు కోటి రూపాయలకు పైగానే ఉంటుంది. భూమికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో… తప్పుడు పత్రాలు సృష్టించి ఈ తతంగాన్ని నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు ఈ వ్యవహారంలో ఐదు లక్షల రూపాయలకు పైగా చేతులు మారినట్లు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ వ్యవహారంలో తప్పెవరిది..? చేతులు మారిన మొత్తంలో ఎవరికి ఎంత ముట్టింది.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






Total views : 76909