అమెరికా, ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగుతున్నారు. తాజాగా హర్మూజ్ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు సంబంధించి ఇరాన్‌పై US ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరానే తమ హెలికాప్టార్ కూల్చేసిందని ఆరోపిస్తున్న ట్రంప్.. ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటన అనంతరం అమెరికా మిలిటరీ దాడులకు దిగింది. ఇరాన్ అనుచిత దాడి కారణంగానే తాము దాడులు చేపడుతున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హర్మూజ్ సమీపంలోని ఖేష్మ్ దీవిలో బాంబు దాడులు చేస్తోంది.
ఒమన్ తీరం వెంబడి హార్ముజ్ సమీపంలో నిన్న తెల్లవారుజామున గస్తీ చేస్తుండగా.. అమెరికా మిలిటరీ హెలికాప్టర్ ఏహెచ్ 64 అపాచీ కూలిపోయింది. అందులో ఉన్న తమ ఇద్దరు పైలట్లను ఓ డ్రోన్ బోట్ సహాయంతో అమెరికా రక్షించింది. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా హెలికాప్టర్ కూలినట్లు అమెరికా దర్యాప్తులోనూ తేలిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతికార దాడులకు దిగుతోంది అమెరికా. అన్యాయమైన దురాక్రమణకు ప్రతిస్పందనగా ఆపరేషన్ చేపట్టినట్లు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు తమ సైన్యాన్ని సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతకుముందు దాడికి తప్పనిసరిగా సమాధానం ఇస్తామని ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్ కూడా పెట్టారు. అనంతరం అమెరికా మిలిటరీ ఇరాన్‌పై దాడులకు దిగింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి.