Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

by CVR NEWS
తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ముఖ్యంగా సిఫార్సు లేఖలపై ఆధారపడి దర్శనానికి వచ్చే భక్తులు, ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

జులై నెలలో నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అంతరాయం కలగనుంది. తిరుమల ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 14 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా, జులై 17ఆణివార ఆస్థానం పర్వదినం కారణంగా…వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. జులై 19 ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద కార్యక్రమం నేపథ్యంలో, జులై 29 జీయర్‌ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.

ఆగస్ట్ నెలలో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్ట్ 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా…. ఆగస్ట్ 24న పవిత్రాల సమర్పణ కార్యక్రమం ఉన్నందున వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు.

ఏటా అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. దీంతో ఈ నెలలో ఎక్కువ రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. సెప్టెంబర్ 8న బ్రహ్మోత్సవాల ముందు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా…. సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా… సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23 వరకు బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు ముందు రోజులలో, ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తేల్చి చెప్పింది. అయితే, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. పర్వదినాల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కావున, తిరుమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులు తేదీలను జాగ్రత్తగా గమనించి, అనవసర ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: