Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.

చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.

by CVR NEWS
చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు

తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, అపరిశుభ్రతపై వస్తున్న వరుస ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో సీఎం విజయ్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చెన్నై ఎగ్మూర్‌లోని ప్రముఖ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి, ICHలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి స్వయంగా వార్డుల్లోకి నడుచుకుంటూ రావడంతో ఆసుపత్రి అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఆస్పత్రిలోని ప్రతి వార్డును పరిశీలించిన సీఎం విజయ్.. అక్కడ అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై రోగులను, వారి కుటుంబ సభ్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది పనితీరు ఎలా ఉంది? మందులు ఉచితంగా ఇస్తున్నారా? ఎవరైనా లంచాలు అడుగుతున్నారా? అంటూ ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడున్న చిన్నారి శిశువులను ఎత్తుకుని ముద్దాడిన సీఎం, బాలింతలతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను, అందుతున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రి ఆవరణలో, వార్డుల పరిసరాల్లో అపరిశుభ్రత చూసి సీఎం విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పసిపిల్లలు ఉండే హాస్పిటల్‌ను ఇంత నిర్లక్ష్యంగా ఉంచుతారా అంటూ అక్కడున్న ఉన్నతాధికారులపై, శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం అందించడం ప్రభుత్వ బాధ్యతని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యరంగంలో జవాబుదారీతనం పెంచేందుకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ముందస్తు నోటీసులు లేకుండా తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఈ సందర్భంగా సీఎం విజయ్ స్పష్టం చేశారు. సీఎం తాజా చర్యతో తమిళనాడులోని ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

039375
Total views : 196553

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: