రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ లో రాష్ట్రస్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో “రాష్ట్రంలో ఎల్‌నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్” పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత వర్షపాత పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, వర్షాలు ఆలస్యం అయ్యే అవకాశాలు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం, భూగర్భ జలాల లభ్యత, ఖరీఫ్ పంటలపై ప్రభావం, రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు.
వర్షపాత పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ప్రతి జిల్లాకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తుగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాలుగా మారిన నేపథ్యంలో శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించాలని తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా కురిసినా రైతులు ఇబ్బందులు పడకుండా వరికి బదులుగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వేరుశనగ, పెసలు, మినుములు, కందులు, సజ్జలు, జొన్నలు వంటి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.



Total views : 207810