రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎస్ఐ తిరుపతయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. డీజీపీ ఆదేశాలతో ఎస్ఐ తిరుపతయ్యపై ఈ చర్యలు తీసుకున్నారు. గంధంగూడ దగ్గర మనవరాలితో కారు డ్రైవింగ్ చేయించారని తిరుపతయ్యపై నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాదికారులు.
చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే బాధ్యతారహితంగా ప్రవర్తించారంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. తన ఆరేళ్ల మనవరాలి చేతికి కారు స్టీరింగ్ ఇచ్చి రద్దీ రోడ్డుపై డ్రైవింగ్ చేయించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉన్నతాధికారులు స్పందించి ఆయనపై కేసు నమోదు చేశారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ-బైరాగిగూడ రోడ్డుపై ఎస్సై తిరుపతయ్య మనవరాలితో కారు డ్రైవింగ్ చేయించారు. రద్దీగా ఉండే ఆ మార్గంలో ఒక చిన్నారి కారు నడుపుతుండటాన్ని గమనించిన తోటి వాహనదారులు షాక్‌కు గురయ్యారు. వారు కారును అడ్డుకుని, పసిపిల్లల చేతికి స్టీరింగ్ ఇచ్చి ఇతరుల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెడుతున్నారని ఎస్సైను నిలదీశారు. కారు తన కంట్రోల్‌లోనే ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారాయన. దీంతో వాహనదారులకు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తతంగాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా స్పందించారు. మైనర్‌కు వాహనం ఇవ్వడం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి నేరాల కింద ఎస్సై తిరుపతయ్యపై పలు సెక్షన్ల కింద నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. తాజాగా డీజీపీ ఆదేశాలపై ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.




Total views : 207747