ఏపీ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించి, సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ పక్షుల కేంద్రం ‘కొండకర్ల ఆవ’ను ‘కన్జర్వేషన్ రిజర్వ్’ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో కీలక ముందడుగు పడిందని డెప్యూటీ సీఎం తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం దీనిని కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జలవనరుల శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. సాగునీరు, జలాశయ నిర్వహణ, హైడ్రాలిక్ వ్యవస్థలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఎలాంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతులు లభించాయి.
శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా రాష్ట్రంలో మొత్తం 950 చిత్తడి నేలలను గుర్తించామని, వీటిని నోటిఫై చేయాల్సి ఉందన్నారు. తొలిదశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని వెల్లడించారు. చిత్తడి నేలలు భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిత్తడి నేలలపై జరిగే అక్రమ ఆక్రమణలు, విధ్వంసక చర్యలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. అనేక రకాల వలస మరియు స్థానిక పక్షులకు నిలయంగా ఉన్న కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేయాలని, జలవనరుల శాఖ సమన్వయంతో ఎకో-టూరిజం అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.