తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది. టీవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త కూటమికి సామాజిక న్యాయ విజయ కూటమి గా పేరు ఖరారైంది. విజయ్ అధ్యక్షతన చెన్నై పనయూర్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి మాణిక్కం ఠాగూర్, వీసీకే అధినేత తిరుమావళవన్, ఎండీఎంకే నేత వైకో, ఐయూఎంఎల్ నేత ఖాదర్ మొహిద్దీన్ సమావేశానికి హాజరయ్యారు.
()ఈ కూటమి కేవలం ఎన్నికల పొత్తుగా కాకుండా.. మత సామరస్యం, సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, వీసీకే వంటి పార్టీలతో విజయ్ టీవీకే కలిసి రావడం ద్వారా విస్తృత సామాజిక వర్గాలను కలుపుకునే ప్రయత్నం కనిపిస్తోంది. మరోవైపు సీపీఐ, సీపీఎం ఈ సమావేశానికి హాజరుకాకపోవడం కూటమి విస్తరణపై ఆసక్తికర పరిణామంగా మారింది.
()విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి భవిష్యత్ రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధికారికంగా కూటమి పేరు ఖరారైన నేపథ్యంలో.. భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యక్రమం, భవిష్యత్ ఎన్నికల వ్యూహం ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.