ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చేందుకు ఒక విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సముద్ర సంపదను అందిపుచ్చుకుంటూనే, తీర ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. సముద్రతీర అభివృద్ధిపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చ జరుగుతోందని, సముద్ర గర్భంలోని అపారమైన వనరులను వెలికితీయడం ద్వారా విస్తృత ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ఏపీలో ఇప్పటికే ఆక్వాకల్చర్‌ను గణనీయంగా అభివృద్ధి చేశామని, రొయ్యలు, చేపల సాగు, ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా ఆక్వా ఉత్పత్తుల్లో వాల్యూ అడిషన్ జరగాలని, తద్వారా రైతులకు, రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తుందని నిర్దేశించారు. అదే సమయంలో ఆక్వా వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని, ఈ సవాళ్లను అధిగమించేందుకు పూర్తిస్థాయి అధ్యయనం జరగాలని సూచించారు. తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా మెరైన్ బయోడైవర్సిటీని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం స్పష్టం చేశారు. సముద్రాలతో పాటు తీరప్రాంతాల్లో లభించే రేర్ ఎర్త్ మినరల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఆ వనరులను అందిపుచ్చుకోవాలని అన్నారు. తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరప్రాంతాన్ని రక్షించుకోవడం అత్యంత ముఖ్యమని, దీనికోసం మడ అడవులు, తాటి చెట్ల పెంపకం వంటి మూడంచెల సహజ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఏపీ తీరం సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్..
82
previous post



Total views : 90074