Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh 45 రోజుల పాటు టీడీపీ ఇంటింటి ప్రచారం.

45 రోజుల పాటు టీడీపీ ఇంటింటి ప్రచారం.

by CVR NEWS

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా చేరిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించనుంది. ఈ ప్రచార కార్యక్రమంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మంత్రుల నుంచి బూత్ స్థాయి కన్వీనర్ల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్లినట్లే.. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసిన హామీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని చంద్రబాబు గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో విజయం సాధించామని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి సమిష్టి పోరాటం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువ కావాలని పార్టీ నేతలకు సూచించారు.

పార్టీలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కూడా సీఎం నొక్కి చెప్పారు. తనకు అనుచరులు కాదు.. నాయకులు కావాలని స్పష్టం చేశారు. సమస్యలకు పరిష్కారం చూపే సామర్థ్యాన్ని పెంచుకోవాలని.. ప్రజలు, కార్యకర్తలతో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీ విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కూడా చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. గత పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించాలని.. ముఖ్యంగా యువతకు జరిగిన నష్టాన్ని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తేనే ప్రతిపక్ష విమర్శలకు సమాధానం ఇవ్వగలమని అన్నారు. మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమేనని విశ్వాసం వ్యక్తం చేస్తూనే.. ఏమరుపాటుకు తావు ఇవ్వొద్దని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.

రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం, స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం లక్ష్యంగా టీడీపీ చేపడుతున్న 45 రోజుల ఇంటింటి ప్రచారం రాజకీయంగా ఎంత మేర ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: