తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇది అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-05ను నింగిలోకి మోసుకెళ్లింది. సబ్-జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇది సుమారు 8 నెలల విరామం తర్వాత ఇస్రో చేపట్టిన మిషన్ కావడం విశేషం. జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 19వ రాకెట్ ప్రయోగం. ఈవోఎస్-05 ఉపగ్రహం బరువు 2,268 కిలోలు. సరిహద్దు ప్రాంతాలను వేగంగా, స్పష్టంగా కెమెరాలతో పరిశీలించనుంది. తుపానులు, వరదలు, భూకంపాలను నిమిషాల వ్యవధిలోనే గుర్తించనుంది. ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలను జారీ చేయనుంది. పంటల ఆరోగ్యం, భూవినియోగంలో మార్పులను పరిశీలించనుంది. దేశ రక్షణ రంగంలో ఈ ఉపగ్రహం కీలకం కానుంది. దేశ భౌగోళిక సరిహద్దుల సమాచారానికి రియల్‌టైమ్‌లో సేకరించనుంది.
CVR NEWS
హైదరాబాద్ నగరంలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్రాస్ రెజిమెంట్ క్యాంప్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్ వద్ద భారీగా డిటోనేటర్లు బయటపడటం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ బకెట్లో ఉంచిన 160 డిటోనేటర్లను అధికారులు గుర్తించారు. సమాచారం అందడంతో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ , స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బండిల్లో 20 చొప్పున మొత్తం 8 బండిళ్లలో వాటిని భద్రపరిచినట్లు సమాచారం. ఇటీవల మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో అత్యాధునిక ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి చోరీకి గురైన ఘటనపై మిలిటరీ ఇంటెలిజెన్స్, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలోనే ఈ డిటోనేటర్లు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఆయుధాల చోరీకి, డిటోనేటర్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా డిటోనేటర్లను అక్కడ వదిలి వెళ్లిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఏటూరు నాగారం గిరిజన గురుకుల కళాశాలను సందర్శించిన మంత్రి.. అక్కడ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఐటీడీఏ భవన స్థలాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి.. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుస్తులు, జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేలా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. స్థానికంగా తయారీ కేంద్రాల ద్వారా గిరిజన మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రతి నీటి సంరక్షణ పనిని ఒకే సమగ్ర జల భద్రతా ప్రణాళికలోకి తీసుకురావాలని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన జల్ సంచయ్ జన్ భాగీదారీ–డిపార్ట్మెంటల్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రతి నీటి సంరక్షణ ఆస్తికి ప్రత్యేక గుర్తింపు, జియో ట్యాగింగ్, బాధ్యత వహించే సంస్థను నిర్దేశించాలని సూచించారు. పనుల విజయాన్ని నిర్మాణాల సంఖ్యతో కాకుండా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల రీచార్జ్, నీటిమట్టాల పెరుగుదల, ఏడాది పొడవునా నీటి లభ్యత ఆధారంగా అంచనా వేయాలని అన్నారు.
2025లో జల్ సంచయ్ జన్ భాగీదారీలో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలోని 44,360 నీటి వనరుల్లో 28,739పై పనులు చేపట్టి, 22,428 చెరువుల పునరుద్ధరణ పూర్తిచేశామని చెప్పారు. 2026–29 మూడేళ్లలో 17.28 లక్షల ఎకరాలకు సాగునీరు కల్పించేందుకు లేదా స్థిరీకరించేందుకు రూ.46,110.35 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్లలో పూడిక తొలగింపుతో పాటు వర్షపాతం, వరద ప్రవాహం, రిజర్వాయర్ ఇన్‌ఫ్లోలను ముందుగానే అంచనా వేసేందుకు ఏఐని వినియోగించాలని, అర్హత కలిగిన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం పీఎంకేఎస్‌వై కింద సహాయం అందించాలని కోరారు.
హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలోని ప్రతి గల్లీ తనకు తెలుసని, ఇది ఓల్డ్ సిటీ కాదని.. ఒరిజినల్ సిటీ అని వ్యాఖ్యానించారు. చార్మినార్ పరిసరాల్లో అద్భుతమైన ప్రాంతాలున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని ఆరోపించిన సీఎం.. పాతబస్తీకి ఏం కావాలో చెప్పాలని, అవసరమైన నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. మూసీ నది సుందరీకరణపై కూడా మాట్లాడిన రేవంత్.. సబర్మతి, గంగానదులను అభివృద్ధి చేయొచ్చని, హైదరాబాద్‌లో మూసీని మాత్రం బాగు చేయొద్దని బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు. పాతబస్తీలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంఐఎం, ఒవైసీ సోదరులపై మాట్లాడుతూ.. దేశభక్తిలో వారు ప్రధాని మోదీ, అమిత్‌షా కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. హిందూ, ముస్లింలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.. కొండా సురేఖతో పాటు సీనియర్ నేత, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డిపైనా ప్రభుత్వం వేటు వేసింది. చిన్నారెడ్డిని తెలంగాణ ప్లానింగ్ కమిషన్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించింది. దీంతో ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న విజయలక్ష్మి.. ఆ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమె స్థానంలో నేరెళ్ల శారదను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కుడా చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణికి అవకాశం కల్పించింది. వరుస నియామకాలు, మార్పులతో తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్ర ప్రణాళిక సంఘం పదవి నుండి డాక్టర్ చిన్నారెడ్డిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం తో పాటు, అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు చిన్నారెడ్డి ఎమ్మెల్యే, పార్టీ అధిష్టానం పై చేసిన వ్యాఖ్యానాల ఆధారాలు ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు దక్కకపోవడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి లభించింది. దీనితో ఆయన నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో అధికారికంగా పాల్గొనడం.. ఎమ్మెల్యేతో కలిసి పోకపోవడం.. పలు సందర్భాలలో విమర్శలు చేసిన నేపథ్యంలో పార్టీ నిర్ణయాలు తీసుకుంది.
మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో సమాధానమిచ్చింది.
కొండా సురేఖ ‘కులం’ కార్డుకు కాంగ్రెస్ కౌంటర్: ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు
మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో సమాధానమిచ్చింది. “తాను బీసీ మంత్రిని కాబట్టే నాపై కుట్ర చేసి పదవి నుంచి తప్పించారు” అంటూ కొండా సురేఖ సెంటిమెంట్ కార్డు వాడగా.. దానికి కాంగ్రెస్ మార్క్ రాజకీయ కౌంటర్ ఇచ్చింది. ఒక బీసీ నేతను పదవి నుంచి తప్పిస్తూనే, అదే సమయంలో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన మహిళా నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టింది. కొండా సురేఖ ఆరోపణలను తిప్పికొట్టేలా ప్రభుత్వం చేపట్టిన కీలక నియామకాలు చేపట్టింది. మున్నూరు కాపు అయిన గద్వాల విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా, గౌడ్ సామాజికవర్గానికి చెందిన నేరెళ్ల శారదను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా, పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్ పర్సన్‌గా నియమించింది.
బీసీ వర్గానికి చెందిన సురేఖ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన ఉప కులాలకు (మున్నూరు కాపు, గౌడ్, పద్మశాలి) ప్రాతినిధ్యం కల్పిస్తూ మహిళా నేతలను అగ్రపీఠాన కూర్చోబెట్టింది. దీని ద్వారా ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం కాదని, కేవలం వ్యక్తిగత, పాలనాపరమైన కారణాల వల్లే నిర్ణయాలు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. కొండా సురేఖ వేసిన ‘బీసీ కార్డ్’కు కాంగ్రెస్ ఇచ్చిన ఈ కౌంటర్ వ్యూహం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత పరిణామాలు, నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో స్పందించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న నేతలకు ఏఐసీసీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడుతున్నారు.. వెనుక ఉండి ఎలాంటి పనులు చేస్తున్నారనే దానిపై తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని హైకమాండ్ స్పష్టం చేసింది. ఇకపై ఇటువంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పింది.
పార్టీ నేతల ఓపికకు, అధిష్టాన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. ఇకపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదని, కఠిన చర్యలు (వేటు) తప్పవని హెచ్చరించింది. ఏఐసీసీ స్పష్టమైన నిర్ణయంతోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిందని ప్రస్తావించింది. అధిష్టానం నియమించిన సీఎంపై తరచూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని పేర్కొంది. సొంత పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడే నాయకులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా కమిటీ ద్వారా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పబ్లిక్ డొమైన్లో జరుగుతున్న చర్చలు, నాయకుల వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండని వారిపై రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పదవి నుంచి తొలగించే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి లేదని, సీఎం రేవంత్ రెడ్డే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి తనను బర్తరఫ్ చేయించారని ఆరోపించారు. నన్ను తప్పించకపోతే తానే వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బెదిరించారని టీడీపీ రక్తం ఉన్నవారు ఇలాగే ప్రవర్తిస్తారని హాట్ కామెంట్స్ చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా, రాజీనామా చేయమని అడగకుండా, ఎలాంటి సంతకం లేని ఒక తెల్ల కాగితం ఆధారంగా నన్ను బర్తరఫ్ చేశారు. నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇది ఒక బీసీ మహిళను తీవ్రంగా అవమానించడమేనన్నారు. ఇవాళ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె తన బర్తరఫ్ వెనుక కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రిగా వచ్చిన మొదటి రోజు నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాపై పక్షపాతం చూపిస్తున్నారని ఆయన వియ్యంకుడు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి చెప్పినట్లే పొంగులేటి నడుచుకుంటున్నారని ఆరోపించారు. బసవరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణతో పాటు జిల్లాలో నా వ్యతిరేక గ్రూప్ అంతా రఘురాంరెడ్డి శిష్యులేనని అన్నారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదని ఎవరి కుటుంబంలోనైనా ఒక్కొక్కరు ఒక్కో రాజకీయ అభిప్రాయంతో ఉంటాయన్నారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన కుమారుడు అర్వింద్ బీజేపీలో ఉన్నారని చెప్పారు. నా బిడ్డ పదేళ్లుగా టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీగా చేసుకున్నారని ఆరోపించారు. నా కూతురు వ్యాఖ్యల సాకుతో నన్ను టార్గెట్ చేయడమే ఇక్కడ అసలు ప్లాన్ అని అన్నారు. నన్ను నిష్కారణంగా నిందించిన వారికి ఉసురు తగులుతుందని హెచ్చరించారు.కొండా మురళి పదవిపై రేవంత్ మాట తప్పారని కొండా సురేఖ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో కొండా మురళీకి జిల్లా బాధ్యత ఇస్తా అన్నారు. 11 సీట్లు గెలిపించాం. ఆ తర్వాత అనేక సార్లు మురళి పదవి సంగతి ఏంటని సీఎంను అడిగితే MLA లు అంతా వ్యతిరేకంగా ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుని రండి పదవి ఇస్తానన్నారని ఆరోపించారు. అదే తనకు కావాల్సిన వారికి మాత్రం పదవులు ఇచ్చుకున్నారని ఆరోపింంచారు.
పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు స్పష్టమైన వివరణ ఇచ్చానని, అయినా వినకుండా తనను టార్గెట్ చేశారని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం నాకు సంతోషమే అన్నారు. రెండున్నరేళ్లు నా శాఖకు, ప్రజలకు న్యాయం చేశా. కాంగ్రెస్‌లో ఉండాలా వద్దా అనే అంశంతో పాటు భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని తన భర్త కొండా మురళితో కలిసి త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగింపు , చిన్నారెడ్డి వ్యవహారం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించకపోవడం వల్లే మంత్రివర్గం నుంచి తొలగించారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా దూషిస్తే.. దాన్ని ఖండించాల్సిన బాధ్యత క్యాబినెట్ మంత్రిపై ఉంటుందని అన్నారు. తన కూతురు తప్పు చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద కూడా కొండా సురేఖ చెప్పలేదని తెలిపారు. పార్టీ విధించిన లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలను కూడా మల్లు రవి ప్రస్తావించారు. క్యాడర్లో ఉత్సాహం నింపేందుకే సీఎం అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని.. టికెట్ల విషయంలో తుది నిర్ణయం ఏఐసీసీదేనని స్పష్టం చేశారు. కులాల ఆధారంగా కాంగ్రెస్‌లో చర్యలు ఉండవని తెలిపారు. కొండా సురేఖపై గతంలోనూ తనకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఫిర్యాదులు వస్తే పార్టీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని అధిష్టానం భావించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వాళ్లిద్దరిని తొలగించడం క్రమశిక్షణలో భాగమే అని చెప్పారు. ఇద్దరి ఇష్యూలో అన్ని విషయాలు తెలుసుకుని రిపోర్ట్ ఇచ్చానన్నారు. మహిళను పదవి నుండి తొలగించారని వేరే పార్టీల వాళ్లు మాట్లాడతారని, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే గద్వాల విజయలక్ష్మికి ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ఆమె మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారని అన్నారు.
అదే విధంగా కాకతీయ టెక్స్ టైల్స్ డెవలప్మెంట్ ఛైర్మన్ గా పద్మశాలి కమ్యూనిటీకి చెందిన గుండు సుధారాణికి పదవి ఇచ్చారన్నారు. కులాలకు సంబంధించిన నాయకత్వంలేనదే భావన లేకుండా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక ఇదివరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ రిపోర్టును రూపొందించి అధిష్టానానికి పంపింది మల్లు రవినే. రిపోర్టు పంపిన సమయంలో అందులో సీరియస్ విషయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ రిపోర్టు ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై విచారణ జరిపి హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా వినూత్న కార్యక్రమాలు, మెగా, జిల్లా స్థాయి ఈవెంట్లు నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు.
వెలగపూడి సచివాలయంలో జరిగిన టూరిజం మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఏడాదంతా పర్యాటక ఉత్సవాలు, రోడ్‌షోలు నిర్వహణపై చర్చించారు.
గోదావరి పుష్కరాలు–2027 కోసం విస్తృత ప్రచారం, టెంట్ సిటీలు, పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, డిజిటల్ కంటెంట్ రూపకల్పనపై మంత్రి సూచనలు చేశారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేయాలని.. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.