ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా వినూత్న కార్యక్రమాలు, మెగా, జిల్లా స్థాయి ఈవెంట్లు నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు.
వెలగపూడి సచివాలయంలో జరిగిన టూరిజం మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఏడాదంతా పర్యాటక ఉత్సవాలు, రోడ్‌షోలు నిర్వహణపై చర్చించారు.
గోదావరి పుష్కరాలు–2027 కోసం విస్తృత ప్రచారం, టెంట్ సిటీలు, పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, డిజిటల్ కంటెంట్ రూపకల్పనపై మంత్రి సూచనలు చేశారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేయాలని.. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
CVR NEWS
మంత్రి కొండా సురేఖ పదవి వ్యవహారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.ప్రజల్లో భద్రతా భావం కల్పించడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు.అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఘనంగా ప్రారంభమైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త చిత్రం “ఇ.ఎం.ఐ”
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త చిత్రం “ఇ.ఎం.ఐ”
నూతన నటీనటులు, టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ ఎమోషన్ తో కూడిన ఎంటర్ టైనర్ గా రాబోతున్న మూవీ
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చిన హీరో ఆది సాయికుమార్, కెమెరా స్విచ్ఛాన్ చేసిన డైరెక్టర్ సాయి మార్తాండ్, స్క్రిప్ట్ అందజేసిన డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ కాంబోలో మరో భారీ చిత్రాన్ని నిర్మించబోతున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ
ఇకపై వరుస చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
ఈ రోజు పూజా కార్యక్రమాలతో “ఇ.ఎం.ఐ” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.
బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని పక్కా ప్లానింగ్ తో నిర్మించి భారీ స్థాయిలో పబ్లిసిటీకి కూడా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇకపై మంచి కాన్సెప్ట్స్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసేందుకు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ప్లాన్స్ చేస్తోంది.
సెప్టెంబర్ 4వ తేదీ నర్సీపట్నం నియోజకవర్గంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని రక్తదానం చేయాలని ప్రజలకు సూచించారు. రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో, ప్రాణదాతలుగా నిలవడం ఎంతో పుణ్యకరమైన కార్యమన్నారు. ప్రజలు, దాతల సౌకర్యార్థం ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి రెండు ప్రత్యేక కేంద్రాలలో ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు వీలుగా పెద బొడ్డేపల్లి మార్కెట్ యార్డులో ఒక శిబిరాన్ని, అలాగే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. పెద బొడ్డేపల్లి కేంద్రానికి మాకవరపాలెం మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరుకావాలని, ఏరియా ఆసుపత్రి కేంద్రానికి గొలుగొండ, నాతవరం మండలాలు, నర్సీపట్నం పట్టణ ప్రజలు విచ్చేసి రక్తదానం చేయాలని స్పీకర్ సూచించారు. నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయ్యన్నపాత్రుడు కోరారు.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి లోకేష్‌ను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కోటప్పకొండలో మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరించారు. జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అని నామకరణం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన ఓ భారీ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ యువజన విభాగం లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో పిఠాపురం జనసేన శ్రేణుల నినాదాలతో మార్మోగిపోయింది.
ఈ సందర్భంగా వేలాది బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జై జనసేన’, ‘జై పవన్ కల్యాణ్’ నినాదాలతో పట్టణ వీధులు దద్దరిల్లాయి. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఆడియో సందేశాన్ని పంపారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని, అయినప్పటికీ ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం చుట్టూనే ఉంటాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కూటమి విజయంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. “నిరంకుశ జగన్‌ను ఓడించి, ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మనమందరం సఫలమయ్యాం” అని అన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా యువత పార్టీని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ అంబర్‌పేటలో నకిలీ గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అమాయకులను ముంచేస్తున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును అంబర్పేట్ పోలీసులు రట్టు చేశారు.ఈ ముఠా ముఖ్యంగా ఏటీఎంల వద్దకు వచ్చే వారిని టార్గెట్ చేసేది. తమకు అర్జంట్‌గా క్యాష్ కావాలని, చేతిలో ఉన్న నగదు ఇస్తే.. గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తామని నమ్మించేవారు. ఆ తర్వాత నకిలీ యాప్‌ల ద్వారా లావాదేవీలు జరిగినట్లు నకిలీ స్క్రీన్షాట్లు చూపించి.. బాధితుల నుంచి నగదు తీసుకుని అక్కడి నుంచి చెక్కేసేవారు. దీనిపై వచ్చిన మూడు ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులతో పాటు ఒక బాల నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ పేమెంట్లు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంది. తమ ప్రజా పాలనలో సామాన్యుల కష్టాలను తీర్చడానికే నిరంతరం కృషి చేశామని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరే అన్నారని, కానీ తమ ప్రభుత్వం రాగానే వరి సాగుకు మద్దతుగా రూ.500 బోనస్ అందిస్తూ, వరి ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపామని గుర్తుచేశారు. రైతు సంక్షేమానికై ఇప్పటికే రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8.21 లక్షల కోట్లకు పైగా అప్పులు, నిలిచిపోయిన బకాయిలు, సర్పంచ్ల బకాయిలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులను కూడా తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసిందని తెలిపారు. అతి త్వరలోనే మరో 3 లక్షల మందికి కొత్తగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు అందజేయబోతున్నామని ప్రకటించారు.
కేటీఆర్ హద్దులు మీరి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ధరణి పేరుతో కొల్లగొట్టిన భూములు, ఆస్తులపై విచారణ జరుగుతోందని, 22ఏ భూములపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిజమైన ప్రతిపక్ష హోదాకు కేసీఆర్ పూర్తిగా అనర్హుడని విమర్శించారు.
రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే పనిలో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సరికొత్త వ్యూహాలకు తెరలేపారు. తెలంగాణకు పెట్టుబడులు, పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించడమే లక్ష్యంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులపై సానుకూల హామీలు రాబట్టే ప్రయత్నం చేశారు.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయులతో సీఎం రేవంత్ రెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. ఈ భేటీల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు ముఖ్య అతిథిగా రావాలంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను స్వయంగా ఆహ్వానించారు. అంతేకాదు, ఈ సమ్మిట్‌లో భాగంగా డిఫెన్స్ ఎక్స్పోను నిర్వహించి, కేంద్ర రక్షణ శాఖను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద ప్రతిపాదించిన డీఆర్డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి కేటాయించాలని ప్రతిపాదించారు.
మరోవైపు..పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సమావేశమైన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలోని విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పునరుద్ధరణ కోసం ఇప్పటికే 750 ఎకరాలు సేకరించామని, కావాలంటే మరో 750 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధం అంటూ ప్రతిపాదించారు.
కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలపైనా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణకు రానున్నట్లు తాజా సమాచారం. అంటే.. రోడ్లు, రైళ్లు మాత్రమే కాదు.. తెలంగాణలో ఎయిర్ కనెక్టివిటీని కూడా విస్తరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.
మొత్తంగా.. ఢిల్లీ పర్యటనలో రేవంత్‌రెడ్డి రెండు ట్రాక్‌లపై ముందుకు సాగుతున్నారు. ఒకవైపు.. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై ఫోకస్..
మరోవైపు.. రక్షణ, ఏరోస్పేస్, విమానయాన రంగాల్లో కేంద్ర సహకారం కోసం లాబీయింగ్. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు, భూములు, నిధులు, సహకారం కోసం ఢిల్లీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు.. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు ఎంతవరకు ఫలితాలిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సీఎం.. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుంది. సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న డిఫెన్స్ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రక్షణ రంగంలో పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత, తయారీ రంగాన్ని తెలంగాణలో మరింతగా విస్తరించేందుకు ఈ ఎక్స్పో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి హాజరు కానున్నారా? డిఫెన్స్ ఎక్స్పోను ప్రారంభిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.