శ్రీ తిరుపతమ్మ అమ్మవారు, శక్తి, సంపద, దయాదాక్షిణ్యాలకు దేవత. ఆమె పెనుగంచిప్రోలుకు అధిష్టానం. ఆలయం మున్నియేరు నదికి ఆనుకుని ఉంది. శ్రీ తిరుపతమ్మ ఆలయంలోని దేవత గ్రామదేవతగా పరిగణిస్తారు, అందుకే తిరుపతమ్మతల్లి దేవతను చాలా శక్తివంతమైన దేవతగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ జాతరకు వేలాది మంది మహిళలు బోనాలు తిరుపతమ్మ దేవతకు సమర్పించుకుంటారు.
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర :
భారతదేశంలో, స్త్రీలను గౌరవించే చోట దేవతలు సంతోషంగా ఉంటారు. వారి నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు అనే వాస్తవాన్ని ధృవీకరించే నానుడి ఉంది. 17వ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గ భూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకుని కృష్ణా ప్రాంతాన్ని పరిపాలించడు. అతని రాజ్యంలో అనిగండ్లపాడు గ్రామంలోని “కొల్ల” కుటుంబంలో తిరుపతమ్మ జన్మించింది. ఆమె “కాకాణి” అనే ఇంటిపేరు గల కుటుంబానికి చెందిన గోపయ్యను వివాహం చేసుకుంది. భగవంతుని పట్ల తనకున్న అచంచలమైన భక్తితో రెండు కుటుంబాలకు మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చింది. తిరుపతమ్మ గొప్ప భక్తురాలు మాత్రమే కాదు, భర్తతో బాధలు, సంతోషాలు పంచుకునే మంచి గృహిణిగా పేరుపొందింది. అయినప్పటికీ, ఆమె తన భర్త ఇంట్లో తీవ్రమైన అనారోగ్యం, కష్టాలను ఎదుర్కొంది. చివరగా, తన భర్త చనిపోయినప్పుడు ఆమె తన భర్త అంత్యక్రియల చితిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె “ఏక సంతాగ్రాహి”. ఆమె పురాణాలు, వేదాలు, రామాయణ, మహాభారతాలు నేర్చుకుంది. పొరుగువారికి, గ్రామస్తులకు ఉపన్యాసాలు ఇచ్చింది. శ్రీ తిరుపతమ్మ శ్రీ వేంకటేశ్వర భగవానుని పట్ల అచంచలమైన భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్య యోగం మొదలైన వాటి ద్వారా రెండు కుటుంబాలకు, మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. పెనుగంచిప్రోలు ఆలయంలో శ్రీ తిరుపతాంబ “శక్తి” ప్రతిరూపంగా పూజింపబడుతోంది. ఆమె తన భక్తులకు జీవితంలోని సద్గుణాలను బోధించింది. ఆమెను పెనుగంచిప్రోలులోని అడోబ్, ముదిరాజ్ పాపమాంబ ఆమెకు ప్రధాన భక్తురాలుగా చేసింది. అందువల్ల ఆమె కుటుంబ సభ్యులును ఆలయంలో పూజలు, ఇతర సేవలను నిర్వహించడానికి నియమిస్తారు. జానపద కథల ప్రకారం పురాతన కాలంలో 101 దేవాలయాలు ఉండేవిని, కాబట్టి దీనిని పెదకాంచీపురంగా భావించేవారని తెలుస్తుంది.
Devotional
తిరుమలలో శ్రీరామకృష్ణ ముక్కోటి తీర్థంను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఈ తీర్థం వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించడం అనవాయితీ. భారీ స్థాయిలో భక్తులు రామకృష్ణ తీర్థ ముక్కోటిలో పాల్గొన్నారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి, సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం. ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు. క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొండ కింద పట్టణంలోని ప్రధాన రహదారిలో అండర్‌పాస్ నిర్మించడం వల్ల స్థానికుల ఉపాధికి తీవ్ర అవరోధం ఏర్పడిందని తెలిపారు. భక్తుల అవసరాలు గమనించకుండా.. చేపట్టిన పనులు పూర్తి కావడానికి రూ.300 కోట్లు అవసరమని వైటీడీఏ అధికారులు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం విశ్రాంత అధికారులతో చేపట్టిన పనులపై ఆరా తీయనున్నట్లు చెప్పారు. త్వరలో మరో సమీక్ష సమావేశం నిర్వహించి యాదాద్రిలో చోటుచేసుకున్న లోపాలను సరిచేయడంతోపాటు భక్తులకు అవసరమైన వసతులను సమకూర్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. భక్తులు దేవుడి చెంత నిద్రచేసే మొక్కుకు అవకాశం కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. స్వామివారిని భక్తులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రానికి వచ్చే ఆదాయంపై కాకుండా భక్తుల అవసరాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే సీఎంను ఆహ్వానించి.. యాదగిరిగుట్ట, బస్వాపురం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. క్షేత్ర పరిధిలో దాతలకు స్థలాలు కేటాయిస్తే వారే కాటేజీలు నిర్మించుకుంటారన్నారు. సమీక్షలో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ హన్మంత్ కె.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్చంద్ర, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో ప్రాచీనకాలం నుంచి అలా నడుస్తూ వస్తోంది కాబట్టి ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్లిపోతారు. ఇంకొందిమంది మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అంతే తప్ప దానివెనకున్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం వుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గుడిలో మూలవిరాట్టు వుండే గర్భాలయం ప్రశస్తమైంది. గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా, వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయటం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్ర శక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి. ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపుగోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్సక్తిని పొందడానికి వీలుగా వుంటుంది.
అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి ఉద్ధృతస్థాయిలో కొనసాగుతోంది. మొదటి రోజు అంచనాలకు మించి రామభక్తులు ఆలయానికి పోటెత్తారు. అక్కడక్కడా చిన్నపాటి తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోయినప్పటికీ ఆలయంలో మోహరించిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడి పరిస్థితులు సవాలుగా మారాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వచ్చే అన్ని వాహనాలను మరికొన్ని రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాతి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా ఏర్పాట్లు సవాలుగా మారాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. రద్దీని గమనించిన ఆయన అయోధ్య వచ్చే యాత్రికుల రాకపోకలను నియంత్రించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు. దీంతో రానున్న కొన్ని రోజులపాటు అయోధ్యకు వెళ్లే అన్ని వాహనాలపై నిషేధం విధించాలని అధికారులు నిర్ణయించారు. వాహనాలకు సంబంధించి అన్ని ఆన్లైన్ బుకింగ్‌లను రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన బుకింగ్ ఛార్జీలను రీఫండ్ చేస్తామని తెలిపారు.
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను, బోనాల నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరించారు. తమ ఇంటిల్లిపాదినీ పిల్లాపాపలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం కావటం, దీనికి తోడు సమ్మక్క సారళమ్మ జాతరకు ముందు అంజన్నను దర్శనం చేసుకోవటం అనవాయితీ కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అంజన్నను దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి గంట సమయం పడుతోంది. క్యూలైన్లు నిండి వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆయల అధికారులు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
NTR జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవం 2024 సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ నందు మండల రెవెన్యూ అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో జరిగింది. పోలీస్ వారి సమక్షంలో శ్రీ అమ్మవారు మరియు పరివార దేవతలను పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట తీసుకువేళ్ళుటకు ఎద్దుల బండ్ల లక్కీ డ్రా ను చిన్న పిల్లల చేత పోలీస్ స్టేషన్ నందు నిర్వహించారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కోసం ఎద్దుల బండికి, బర్రెల పెద్ద వెంకయ్య గోపయ్య స్వామి కోసం ఎద్దుల బండికి కొత్తగుండ్ల అజయ్ కుమార్ ఎంపిక కాబడినారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి చైర్ పర్సన్ జంగాల శ్రీనివాసరావు, ఎస్ ఐ దుర్గప్రసాద్, మండల రెవెన్యూ అధికారులు, ఆలయ అధికారులు, గ్రామానికి చెందిన ఎద్దుల బండ్ల యజమానులు పాల్గొన్నారు.
అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు. తొలి రోజు రామ్‌లల్లా దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరిచారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహం కిటకిటలాడింది. దర్శనం కోసం వచ్చిన భక్తులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. చిన్నపాటి తోపులాటలు కూడా జరిగాయి. తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. సాధారణ భక్తులకు నేటి నుంచి దర్శనభాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6:30 గంటలకు, రాత్రి 7:30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు.
అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు రామాలయంలో వేద పండితులు శేషాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని భారీ అన్న సమారాధన నిర్వహించారు. పాత బజార్ రామాలయంలో శోభాయాత్ర, ఆర్యవైశ్య రామాలయంలో రామ జపం , హనుమాన్ చాలిస్ పఠించారు. అనంతరం పలు రామాలయాల్లో దీపాలు వెలిగించి రామ జప నామాన్ని పఠించారు.