Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home International హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ.

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ.

by CVR NEWS

అమెరికాలో పనిచేయాలనుకునే విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల భారీ ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ ఫీజు వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.

నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల అదనపు ఫీజును విధిస్తూ గతేడాది సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ ఎలాంటి అధికారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని పేర్కొంటూ జూన్ 8న ఫీజు వసూలుపై స్టే విధించింది. ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ ట్రంప్ యంత్రాంగం బోస్టన్ కేంద్రంగా పనిచేసే ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం, ఈ ఫీజును విధించే అధికారం తమకు ఉందని నిరూపించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేసింది. దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ, ప్రభుత్వ అప్పీల్‌ను తోసిపుచ్చింది.

అమెరికన్ల ఉద్యోగాల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి హెచ్‌-1బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దానిని నిరోధించడానికే ఈ ఫీజు విధించామని ట్రంప్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. సాధారణంగా వివిధ అంశాలను బట్టి హెచ్‌-1బీ వీసా ఫీజు 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు ఉంటుంది. దీనిని ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే అమెరికాలో విద్యార్థి వీసాలపై ఉండి.. హెచ్‌-1బీ వీసాలకు మారే వారికి ఈ భారీ ఫీజు వర్తించదని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: