తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కాసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సీని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల భాస్కరరావు 1935, జూన్ 23న జన్మించారు. 1958లో ఆయన లలిత భాస్కరరావును వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు నాదెండ్ల మనోహర్ ఏపీ మంత్రిగా కొనసాగుతుండగా.. మరో కుమారుడు వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నారు. భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1978 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుంచి 1982 వరకు నాదెండ్ల భాస్కరరావు.. మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. తర్వాతి పరిణామాలతో టీడీపీలో చేరిన నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.ప్రస్తుతం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు.
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‍రావు కన్నుమూత..
543
previous post