దేశంలో మారుతున్న జనాభా సమీకరణాలు, వృద్ధి వల్ల ఉత్పన్నమవుతున్న సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులను సమగ్రంగా అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేయడం కోసం రిటైర్డ్ జస్టిస్ నావలేకర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ప్రకటించారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు ఒక పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. దేశంలో మారుతున్న జనాభా తీరుపై అమిత్ షా ఆందోళన వ్యక్తం చేస్తూ.. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని నిర్దిష్ట సరిహద్దు ప్రాంతాలు, రాష్ట్రాల్లో జనాభా సమతుల్యతలో వస్తున్న వ్యత్యాసాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశం వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ వనరులు, జనాభా వృద్ధి మధ్య సమతుల్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేగంగా జరుగుతున్న జనాభా మార్పులు, వాటి వల్ల స్థానిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, జాతీయ భద్రతపై పడే ప్రభావాలను ఈ ఉన్నత స్థాయి కమిటీ లోతుగా పరిశీలిస్తుంది. జనాభా నియంత్రణతో పాటు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేలా విధానపరమైన సిఫార్సులను ఈ కమిటీ ప్రభుత్వానికి అందించనుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జనన రేట్లు, వలసలు, స్థానిక జనాభాలో వస్తున్న మార్పుల డేటాను ఈ కమిటీ నిపుణుల సహాయంతో విశ్లేషించనుంది. భవిష్యత్తులో పెరగబోయే జనాభాకు అనుగుణంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు ఎలాంటి వ్యూహాలు అవసరమో కేంద్ర ప్రభుత్వానికి రోడ్‌మ్యాప్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో, అంతర్గత భద్రతా వ్యవహారాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ వలసదారులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ చొరబాటుదారులను ఏరిపారేసే చర్యలను ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశిస్తూ.. బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరైనా ఉంటే వేగంగా ఇక్కడి నుంచి పారిపోండి. మిమ్మల్ని జైళ్లలో పెట్టి, మా ప్రజాధనంతో తిండి పెట్టి పోషించడం మాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. మా డబ్బును ఎందుకు వృథా చేయాలి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రధాన ఎన్నికల హామీలలో ఒకటైన అక్రమ వలసదారుల ఏరివేతపై ఇప్పుడు సువేందు సర్కార్ పూర్తిస్థాయిలో యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చొరబాటుదారులను గుర్తించి, వారిని నిర్బంధించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులతో పాటు రోహింగ్యాలను కూడా కచ్చితంగా గుర్తించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు బెంగాల్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లిఖితపూర్వక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నిర్బంధ కేంద్రాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను తక్షణమే అన్వేషించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.





Total views : 90017