డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో సత్తా చాటారు. నియోజకవర్గం నుంచి ఏకంగా 39 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎంపికైన విద్యార్థులను సత్కరించి వారి విజయానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విజయానికి కారణమైన అంశాలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
#అంబేద్కర్కోనసీమజిల్లా #పిగన్నవరం #ఊడిమూడిలంక #బూరుగులంక #గంటిపెదపూడి #ఉచ్చులవారిపాలెం #గ్రామాలు #ఆంధ్రప్రదేశ్ #రూరల్ఏరియా #తాజావార్తలు
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యుల కొరతతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయిలు ఖర్చు చేసి అందంగా భవనాలు నిర్మించి 50 పడకలు ఏర్పాటు చేసినా… రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గైనకాలిజిస్ట్ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణులు స్కానింగ్ వంటి కనీస సేవలు కూడా అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రసవ వేదనతో వచ్చే మహిళలను, ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు వైద్య సేవలు అందక అమలాపురం, కాకినాడ లో కార్పోరేట్ ఆసుపత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో నెలకు 100కు పైగా ప్రసవాలు జరిగే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం గైనకాలజిస్ట్ లేకపోవడంతో వేరు వేరు ఆసుపత్రుల నుంచి వైద్యులను తీసుకొచ్చి డెలివరీలు నామమాత్రంగా చేయిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ లోపంతో ఎమర్జెన్సీ వస్తే హుటాహుటిన కాకినాడ లేదా మరెక్కడికైనా తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి
గత రెండేళ్లుగా డాక్టర్ల నియామకం కోసం స్థానిక ఎమ్మెల్యే అడుగుతున్నా.. గైనకాలజిస్ట్ ని నియమించడం లేదు. ఒకానొక దశలో ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి లోనై ఆసుపత్రి ఎదుటే ధర్నాకి దిగుతానని ఎమోషనల్ అయ్యారు. అయినప్పటికీ అధికారులలో ఏవిధమైన స్పందన లేదు. ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నా చికిత్సకు అవసరమైన సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో అత్యవసర ప్రమాద కేసులు వేరే ప్రాంతాలకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఇద్దరు గైనకాలజిస్ట్ లను నియమించాలని, ఆర్థోపెడిక్ విభాగానికి పూర్తి స్థాయిలో సదుపాయాలను కల్పించాలని కూటమి నేతలు వేడుకుంటున్నారు. ఈ ఆసుపత్రికి గైనకాలజిస్ట్ లతో పాటు అందరినీ పూర్తి స్థాయి వైద్యులను నియమించి ఇక్కడ నివసించే పేదలకు అండగా నిలవాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు…..
దీనిపై రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ డయానా ను వివరణ కోరగా గైనకాలజిస్ట్ , ఆర్థోపెడిక్ డాక్టర్ల సమస్య ఉందని, దీనిపై జిల్లా కలెక్టర్ కు విన్నవించామని తెలిపారు. నాలుగైదు రోజుల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో గైనకాలజిస్ట్ ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంత పేద ప్రజల మహిళల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలానే అవుట్ పేషెంట్లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చాలా మందికి తెలియక 10 గంటలు దాటిన తర్వాత వస్తున్నారని దాని వల్ల సమయం తగ్గిపోతుందని, ఈ విషయాన్ని అందరూ తప్పనిసరిగా గమనించాలని సూచించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు.. ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగు కోరుతున్నా..నేటికీ వారధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో గోదావరికి వరద పోటెత్త డంతో ఆ ప్రభావం ఈ లంక గ్రామాలపై పడ్తుంది. వరద తాకిడి దృష్ట్యా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలను పడవలపైనే బయటకు తరలించాల్సిన వస్తుంది. ఇక ఉపాధి కోసం బయట ఊర్లకు, మండలానికి వెళ్లాలన్నా….విద్యార్థులు..తమ స్కూల్, కాలేజీలకు వెళ్లాలన్న ఈ పడవలపైనే ప్రయాణించాల్సి వస్తుంది. ఇక అత్యవసర పరిస్థితులలో ఎవర్నైనా హాస్పిటల్ కు చేర్చాలన్న ఈ పడవలే ఆధారం…దీంతో వర్షకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. 2024లో వచ్చిన వరద సమయంలో, పది మంది ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. తొమ్మిది మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడగా..ఒకరు మృతి చెందారు. నేటికీ స్థానికులను ఆ భయం వెంటాడుతోంది.
( ) 2022లో వచ్చిన భారీ వరదల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఈ లంక గ్రామాలను స్వయంగా పరిశీలించారు. ఈ నాలుగు గ్రామాలకు ఉపయోగపడేలా బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అదే సంవత్సరంలో 49 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి ప్రభుత్వం..తదుపరి కాలంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు తమ సొంత డబ్బుతో మాత్రమే కొంతమేర పనులు కొనసాగించారు. నిధుల కొరత కారణంగా పనిని నిలిపివేయడంతో.. ఒక సంవత్సరం పాటు పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్న స్థానికులు.. ఎన్ని రోజులలో పనులు పూర్తవుతాయో తెలియక అయోమయంలో పడ్డారు. మళ్లీ స్థానికులు.. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ..బ్రడ్జి నిర్మాణం పూర్తి చేయాలంటూ మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదానంతరం
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో బ్రిడ్జ్ పనులు మళ్ళీ ప్రారంభం కాగా..ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే 22 కోట్ల రూపాయలు మంజూరు చేసింందని.. ప్రస్తుతం పనులు సాగుతున్నాయిని..వచ్చే వర్షాకాలానికి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.




Total views : 196859