వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాలో కార్చిచ్చులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.కెనడాలో చెలరేగిన అడవి మంటల నుంచి వెలువడుతున్న పొగ అమెరికాలోని మిన్నెసోటా, ఇల్లినోయీ, మిషిగాన్, డెట్రాయిట్తో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరాన్ని కూడా దట్టమైన పొగ కమ్మేసింది.దీంతో పలు రాష్ట్రాల్లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ప్రమాదకర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా అటవీ నిర్వహణలో లోపాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అవసరమైతే కెనడాపై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రభుత్వం అధికారికంగా స్పందించనప్పటికీ, ఆంటారియో రాష్ట్ర నాయకుడు డగ్ ఫోర్డ్ మాత్రం గతంలో కార్చిచ్చుల సమయంలో అమెరికాకు కెనడా సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ విమర్శలు చేయడం కంటే పొరుగుదేశాలకు సహకరించడం మంచిదని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం కెనడాలోని ఉత్తర ఆంటారియో ప్రాంతంలో దాదాపు 190 ప్రాంతాల్లో కార్చిచ్చులు కొనసాగుతున్నాయి. మంటలు వ్యాపిస్తున్న ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది.
Tag:



Total views : 221439