కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయమన్నారు. భారాస పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని భాజపా ఎంపీ సన్ని దేవోల్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అందరికీ కనిపిస్తోంది. కానీ, విపక్షాలకు కనిపించట్లేదు అని విమర్శించారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేదే కేసీఆర్ సిద్ధాంతం అని కేటీఆర్ అన్నారు. ఈ తొమిదిన్నరేళ్లు అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడికి ప్రజలు ఎందుకు ఓటు వేయొద్దు? కేసీఆర్‌కు ఎందుకు ఓటు… వేయొద్దంటున్నారో ప్రజలు ప్రశ్నించాలి. ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతారు. వారు చెప్పిన మాటలు విని ఆగమైతే.. ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ హయాంలో పడిన ఇబ్బందులు, సమస్యలు మళ్లీ మొదలవుతాయి అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్
నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. రాజకీయంగా కేసీఆర్‌ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని, బీఆర్ఎస్ను ఓడించడం ఎవరి తరం కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువత ఉందన్నారు. గులాబీ జెండా యువతకు అండగా ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే అని అన్నారు. ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చివరి రెండేళ్లు ఇచ్చారన్నారు. కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు.
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో అమిత్‌షా పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ.. రాహుల్‌ను ప్రధానిని చేయాలని చూస్తుంటే. కేసీఆర్ తన తనయుడు కేటీఆర్‌ను సీఎంను చేయాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు.కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలన్నారు. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని అమిత్ షా తెలిపారు.





Total views : 77657