Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు.

సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు.

by CVR NEWS
సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ అనంతర పరిణామాలపై సురేష్‌ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన తరువాత సీఐ నాగరాజుకి సురేష్ సహకరించినట్లు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు.

ఐతే సాయికృష్ణ లాకప్‌ డెత్‌ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని జాడ ఇంకా కనిపించలేదు. సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో వీరి పాత్ర ఉందని ఖరారు చేసిన నేపథ్యంలో వారి కోసం వేట కొనసాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపర్చాలని సౌత్‌ ఏసీపీకి సిట్‌ అధికారులు ప్రొడక్షన్‌ ఆన్‌ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్‌ నిందితులుగా చేర్చింది. వారిద్దరినీ నగర సీపీ రాజశేఖరబాబు సస్పెండ్‌ చేశారు. వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు.

కృష్ణలంక స్టేషన్‌లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన పదిమందిపై సిట్‌ గురిపెట్టింది. వీరిలో కీలకంగా ఉన్న సురేష్‌ నుంచి పలు వివరాలు సేకరిస్తోంది సిట్‌. టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ మురళీకృష్ణను రెండోసారి పిలిచి విచారించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్‌ బాబూరావును ఇప్పటికే రెండుసార్లు విచారించారు. స్టేషన్‌లో సెక్షన్‌ ఇన్‌ఛార్జి అయిన హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, అలాగే బాబూరావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా సిట్‌ అధికారులు.. సౌత్‌ ఏసీపీ మానసపై ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే.. అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇన్‌స్పెక్టర్‌పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..సాయికృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌..సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కేసులో దర్యాప్తు పురోగతి, న్యాయస్థానానికి నివేదించాల్సిన అంశాలపై సిట్‌ అధికారులు.. డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బైరా రామకోటేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు విచారణలో వెలుగుచూసిన అంశాలపై చర్చించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: