జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. రెండేళ్ల తర్వాత తొలి ఏడాదిలో 100 శాతం సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి ఏడాది తర్వాత నుంచి ఈ సుంకాలు 200 శాతానికి పెంచనున్నట్లు చెప్పారు. ఔషధాలను దేశీయంగానే ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ట్రంప్. ఈ నిర్ణయం ద్వారా అమెరికాకు పెద్ద ఎత్తున జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే భారతీయ ఫార్మా రంగానికి రాబోయే రెండేళ్ల కాలానికి పెద్ద ఊరట లభించినట్లయింది.
అయితే ఈ రెండేళ్ల మినహాయింపు గడువు ముగిసిన తర్వాత అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన టారిఫ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత వచ్చే తొలి ఏడాదిలో జనరిక్ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకం విధిస్తామని, ఆ తర్వాతి ఏడాది నుంచి ఈ సుంకాలను ఏకంగా 200 శాతానికి పెంచనున్నట్లు స్పష్టం చేశారు. మందుల తయారీ కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించి, ఔషధాలను అమెరికాలోనే దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీలు అమెరికాలోనే తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఈ రెండేళ్ల కాలాన్ని గడువుగా విధిస్తున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.




Total views : 223635