నరసరావుపేట ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అమెరికా వెళ్లేందుకు పల్నాడు జిల్లాకు చెందిన హేమనాథ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 16న చెన్నై యూఎస్ కాన్సులేట్ లో ఇంటర్వ్యూకి హేమనాధ్ హాజరయ్యాడు. ధ్రువ పత్రాలను పరిశీలించిన యూఎస్ కాన్సులేట్ అధికారులు …హేమనాధ్ సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీ ధృవపత్రాలుగా గుర్తించి…చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు …యూఎస్ కాన్సులేట్ ఫిర్యాదు చేసింది. వెంటనే హేమనాధ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నరసరావుపేటకి చెందిన ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు నకిలీ ధ్రువ పత్రాలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. హేమనాధ్ తో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా హరిబాబు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నర్సారావుపేటలోని ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ లో పోలీసులు తనిఖీలు చేసి కంప్యూటర్, రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు. నకిలీ సర్టిఫికెట్లు ఎవరైనా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
fake certificates
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కుతున్నారు. చదువుకోకపోయినా పర్లేదు.. డబ్బు ఇస్తే చాలు చేతిలో సర్టిఫికెట్లు చేతిలో పెడుతున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్.. ఇలా ఏదైనా.. చదువుకోకపోయినా సర్టిఫికెట్ మీ చేతికి అందుతుంది. డబ్బు చెల్లిస్తే చాలు పనైపోతుంది. తాజాగా వారి పాపం పండింది. నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టైంది.
ఏలూరులో కలకలం రేగింది. నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువపత్రాల తయారీని ఏలూరులోని ప్రైవేట్ కాలేజీ మేనేజ్ మెంట్ గుర్తించింది. దూరవిద్యకు సంబంధించి కళాశాలను యాజమాన్యం నడుపుతోంది. తమ కాలేజీకే సంబంధించిన నకిలి సర్టిఫికెట్లను మేనేజ్ మెంట్ గుర్తించింది. దాంతో కాలేజీ యాజమాన్యం నివ్వెరపోయింది. దీన్ని సీరియస్ గా తీసుకుంది.
వెంటనే అలర్ట్ అయిన కాలేజీ యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చింతలపూడి పోలీసులు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. చింతలపూడికి చెందిన కొలుకులూరి సోంబాబుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఠా సభ్యులపై నిఘా పెట్టారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల మఠాను అరెస్ట్ చేశారు.