గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. పాత గుంటూరు లోని బాలాజీ నగర్, 3,8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం. జనసేన కార్యకర్తలు ఆగ్రహం. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు. దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు.
Pavan kalyan
భీమవరం సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్న) తీవ్రంగా ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన చెట్లను నరికివేశారని, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు అని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల కోసం మీకెందుకు అని ప్రశ్నించారు. అనేక మంది ప్రధాన మంత్రులు ఆ ప్రాంగణంలో సభలు నిర్వహించారని జగన్ సభకు మాత్రం చెట్లు నరికేశారని అన్నారు. విలువల కోసం విశ్వనియత కోసం మాట్లాడే అర్హత జగన్ కు లేదని జగన్ జైల్ లో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన తల్లిని, చెల్లిని ప్రక్కన బెట్టారని మండిపడ్డారు.
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. జనసేన పార్టీలోకి రావడంతో పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు. సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానిగానే ఉన్నానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో, విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తాను అని తెలిపారు. వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వంశీకృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడు అని కొనియాడారు. స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి, మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు. ఇప్పుడాయనకు సొంత కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం అత్యంత ధనిక ప్రాంతంగా పేరు ఉంది. పారిశ్రామిక వాడలు, ఓడరేవులు, ఖరీదైన భూములు ఇక్కడే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన సీనియర్ నేత ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజవర్గంలో ఖరీదైన భూములతో పాటు లేఔట్లకు సంబంధించి సామాజిక స్థలాలు కూడా ఎమ్మెల్యే సోదరుడు, పిఏ, బంధువులు వారి పేరు మీద రాయించుకున్నారని భావనారాయణ స్వామి ఆలయ మాజీ చైర్మన్, జనసేన రూరల్ నియోజవర్గ ప్రతినిధి పుల్లా శ్రీరాములు (దేవస్థానం శ్రీను) ఆరోపిచారు. సమాచార హక్కు చట్టం కింద తాను తీసుకున్న వివరాలు ప్రకారమే ఈ ఆరోపణలు చేస్తున్నాను అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూరల్ పై ఆరోపణలు చేశారని తాను సేకరించిన కబ్జాల సమాచారాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు శ్రీరాములు తెలిపారు. అదేవిధంగా న్యాయపోరాటం కూడా చేస్తున్నట్లు తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బహిరంగ చర్చికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.
శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అరెస్టు అప్రజాస్వామికమని, ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా? శ్రీ మనోహర్ గారితోపాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తా… పోరాడతా అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి? ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని శ్రీ మనోహర్ గారి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నానని అన్నారు. శ్రీ మనోహర్ గారిని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాడతానని ఆయన అన్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది. బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా , అశ్వారావుపేట స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వీరికోసం పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రచారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు. అయినప్పటికీ అందరూ ఓటమి పాలయ్యారు. అంతేకాదు, ఏ ఒక్కరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. కూకట్పల్లి నుంచి పోటీచేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ ఒక్కరే 39,830 ఓట్లు సంపాదించుకోగలిగారు. మిగతా వారందరూ 5 వేల లోపు ఓట్లకు పరిమితమయ్యారు. తాండూరులో జనసేన అభ్యర్థికి 4,087 ఓట్లు పోలవగా, కోదాడలో 2,151, నాగర్‌కర్నూలులో 1,955, ఖమ్మం 3,053, వైరా 2,712, వైరా 2,712, కొత్తగూడెం1,945, అశ్వారావుపేట అభ్యర్థికి 2,281 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి కీలక నేతలు కూడా డిపాజిట్ కోల్పోయారు. సీపీఎం తొలుత కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా పొత్తు చర్చలు ఫలించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి పాలైంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
నువ్వు రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి మండిపడ్డారు. పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు… నువ్వు రాజకీయ నాయకుడివా, లేక రాజకీయ నటుడివా… లేకపోతే రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.‘అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్? చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్… బీజేపీ పక్కన కట్టావ్. మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు… కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులయ్యా మీవి? చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు… కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1200 మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యులను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే నా ఇజం హ్యూమనిజం అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు.
బలిదానాలపై ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ మాట్లాడారు. ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తానన్నారు. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందని ధీమా వ్యక్తం చేశారు. నాకు తెలంగాణ ఎంతో బలాన్నిచ్చిందని, తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానన్నారు.ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని అన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని… వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతాను అని జనసేనాని స్పష్టం చేశారు.బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు.