ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి కొలువై ఉన్న రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.‘జై జగన్నాథ్’ నినాదాలతో పూరీ వీధులు మార్మోగాయి.
ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి, గుండిచా ఆలయంలోని తన అత్తవారింటికి వెళ్లే జగన్నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో ఒడిశా ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం 13,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని, కేంద్ర బలగాలను మోహరించారు. 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 473 సీసీటీవీ కెమెరాలు, 65 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే జగదల్పూర్, రాయగడ నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పూరీ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద రథయాత్ర గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతుంది.





Total views : 212119