సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా రాహుల్ గాంధీ మొదటి నుంచే డిమాండ్ చేశారని గుర్తు చేశారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం స్వతంత్ర సంస్థలుగా కాకుండా జేబు సంస్థలుగా మార్చుకుని, వాటిని విపక్షాలపై రాజకీయంగా ఉపయోగిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా పనిచేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
యువత పోరాటం, నిరంతర ఒత్తిడి కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించాల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీనామాతో మాత్రమే ఈ వ్యవహారం ముగిసిపోదని, నీట్ పరీక్షల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. దేశ యువత న్యాయం కోసం చేసిన పోరాటానికి ఇది తొలి విజయమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.
అదానీ, అంబానీలు, కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ రెడ్ కార్పెట్ పర్చుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.