Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News న్యాయవాదులకు తెలంగాణలో ప్రత్యేక రక్షణ చట్టం అమలు..

న్యాయవాదులకు తెలంగాణలో ప్రత్యేక రక్షణ చట్టం అమలు..

by CVR NEWS
న్యాయవాదులకు తెలంగాణలో ప్రత్యేక రక్షణ చట్టం అమలు..

న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్భయంగా, స్వతంత్రంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ జీవో ఎంఎస్ నంబర్ 41 ద్వారా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం ద్వారా కోర్టు అనుమతి లేకుండా లాయర్లను అరెస్టు చేయకుండా అత్యంత కీలకమైన రక్షణలు కల్పించారు.

కొత్త చట్టంలో లాయర్లకు ఊరటనిచ్చే ప్రధాన అంశం అరెస్టుల నుంచి రక్షణ. ఇకపై పోలీసులు ఏ న్యాయవాదినైనా అరెస్టు చేయాలంటే ముందుగా న్యాయస్థానం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. దీనివల్ల న్యాయవాదులపై జరిగే అక్రమ అరెస్టులు, కక్షసాధింపు చర్యలకు, వేధింపులకు శాశ్వతంగా చెక్ పడనుంది. అలాగే, ఉద్దేశపూర్వకంగా న్యాయవాదులపై తప్పుడు కేసులు బనాయించే వ్యక్తులకు సైతం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.

న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు చేసినా, బెదిరింపులకు గురిచేసినా, బహిరంగంగా దుర్భాషలాడినా ఈ చట్టం కింద కఠినంగా శిక్షిస్తారు. ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు మొదటిసారి రుజువైతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ నేరం పునరావృతమైతే ఆ శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. జైలు శిక్షను ఒకటి నుంచి ఏడేళ్ల వరకు పొడిగిస్తారు. అలాగే జరిమానాను సైతం రూ.50 వేల నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు విధిస్తారు.

గతంలో ప్రముఖ న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, వివిధ న్యాయవాద సంఘాల సుదీర్ఘ పోరాటాలు, విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 30న శాసనసభలో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజా చట్టం ప్రకారం.. తమకు ప్రాణహాని ఉందని భావించే ఏ న్యాయవాదికైనా ప్రభుత్వం తక్షణమే పోలీసు భద్రత కల్పిస్తుంది. లాయర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీల ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సమాజంలో చట్టాన్ని, ధర్మాన్ని కాపాడే న్యాయవాదులపై దాడులు జరిగితే.. అది మొత్తం న్యాయవ్యవస్థపై దాడి చేసినట్లేనని భావించి ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. దేశంలోనే ఇలాంటి ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: