ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహెట్టి బరాజ్ ఎత్తుపై చర్చిద్దామంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. గత నెల 6న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ లేఖను పంపించారు ముఖ్యమంత్రి. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు 2016 ఆగస్టు 23న జరిగిన అంతరాష్ట్ర బోర్డు సమావేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సీఎం గుర్తుచేశారు. తొలుత ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తుకు బదులు 148 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌లలోని పలు ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేమని ఇటీవల నిర్వహించిన సమీక్షలో నిపుణులు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. బరాజ్ ఎత్తును 148 మీటర్ల కంటే కొంత మేర పెంచితే మహారాష్ట్ర భూభాగంలో అదనంగా మునిగే ప్రాంతం చాలా స్వల్పమేనని తెలిపారు. దీనివల్ల తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించడానికి గొప్ప సౌలభ్యం లభిస్తుందని, మరింత సమర్థవంతంగా, స్థిరంగా నీటిని వినియోగించుకోవచ్చన్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పరస్పర అంగీకారంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఒక నిర్ణయానికి వద్దామని ఫడ్నవీస్‌కు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ మేరకు సమావేశానికి సంబంధించి వీలైనంత త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరారు.
తుమ్మిడిహట్టి బరాజ్ పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ.
592