Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న5 రాష్ట్రాల ఎన్నికలు..

దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న5 రాష్ట్రాల ఎన్నికలు..

by CVR NEWS

బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే..దుర్గా స్క్వాడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్. టీఎంసీ పాలనలో రాష్ట్రం అరాచకంలోకి వెళ్లిపోయిందని, భయం కారణంగా పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బెంగాల్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం అరాచకాన్ని సృష్టిస్తోందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో కట్ మనీ వసూళ్లు, సిండికేట్ పాలన సాగుతోందని, వాటికి ముగింపు పలకాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. భద్రత లేకపోవడం వల్లే పరిశ్రమలు, పెట్టుబడిదారులు బెంగాల్ వదిలి వెళ్లిపోతున్నారని, మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని రాజ్‌నాథ్ విమర్శించారు.

మరోవైపు బెంగాల్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళా కోటా బిల్లును 2029 నుండి అమలు చేయాలని నిర్ణయించడం ద్వారా ప్రధాని మోదీ ఆ బిల్లును ఆచరణలో లేకుండా చంపేశారని ఖర్గే ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించడమేనని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మనుస్మృతిని అనుసరిస్తోందని, అది మహిళలకు, శూద్రులకు అధికారాన్ని నిరాకరిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో అధికార TMCపై విరుచుకపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. మమతా బెనర్జీ మా, మాటి, మానుష్ నినాదంతో అధికారంలోకి వచ్చారని, కానీ నేడు బెంగాల్‌లో ఆ మూడింటికీ రక్షణ లేదని విమర్శించారు. ముఖ్యంగా మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా సందేశ్‌ఖాలీ, ఆర్‌జి కర్ వంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ ఉద్యమం ద్వారానే ఎదిగారని, కానీ ఇప్పుడు ఆమె అక్కడి ప్రజల ఆకాంక్షలను మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

బెంగాల్‌లోని పవిత్రమైన నేలని టీఎంసీ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అప్పగిస్తూ అపవిత్రం చేస్తోందని ఆరోపించారు నితిన్ నబిన్. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని, ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నుంచి బెంగాల్‌లో కొత్త శకం ప్రారంభమవుతుందని నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు బీజేపీ స్టార్ క్యాంపైనర్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనదైన శైలిలో టీఎంసీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం రామ భక్తులను అణిచివేస్తోందని, దుర్గాపూజ వంటి పండుగలను జరుపుకోకుండా అడ్డంకులు సృష్టిస్తోందని యోగి ఆరోపించారు. బెంగాల్ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ఫ్యూలు, అల్లర్లు లేవని.. బెంగాల్‌లో కూడా శాంతి నెలకొనాలంటే మార్పు అవసరమని స్పష్టం చేశారు. యూపీలో మాఫియాలను ఎలాగైతే అణచివేశామో, బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసే గుండాలను వదిలిపెట్టబోమని యోగి హెచ్చరించారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బాబు పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో ప్రాబల్యం కోల్పోతాయని డీఎంకే, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెరిగితే అది అన్ని రాష్ట్రాలకూ సమానంగా మేలు చేస్తుందని ఆయన వివరించారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు గతంలో అటల్ బిహారీ వాజపేయి సీట్ల పెరుగుదలను నిలిపివేశారని, ఇప్పుడు కూడా కేంద్రం దక్షిణాది ప్రయోజనాలను కాపాడుతుందని హామీ ఇచ్చారు. తమిళనాడులో డీఎంకే కుటుంబ పాలన సాగుతోందని, దానివల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టే ప్రభుత్వానికి పట్టం కట్టాలని చంద్రబాబు ఓటర్లను కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: