Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది…

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది…

by CVR NEWS

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది. తాజాగా ‘సికాడా’ అనే పేరుతో పిలవబడే BA.3.2 అనే కొత్త ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పటికే 23కి పైగా దేశాలకు పాకినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ధృవీకరించాయి. ఈ వేరియంట్‌ను మొదటగా 2024 నవంబర్‌లో దక్షిణ ఆఫ్రికాలో గుర్తించారు. అయితే, 2025 సెప్టెంబర్ నుండి దీని వ్యాప్తి వేగవంతమైంది. ప్రస్తుతం అమెరికాలోని 25 రాష్ట్రాల్లోని మురుగునీటి నమూనాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత వేరియంట్లతో పోలిస్తే ‘సికాడా’ వేరియంట్ లక్షణాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు మంట, నొప్పి ప్రధానంగా కనిపిస్తోంది. ముక్కు బ్లాక్ అవ్వడం లేదా నీరు కారడం ఉంటుంది. అదేవిధంగా విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చలితో కూడిన జ్వరం, పొడి దగ్గు ఉంటుందని వైద్యులు తెలిపారు. కొన్ని కేసుల్లో ఈ వేరియెంట్ సోకిన వారికి రుచి, వాసన కోల్పోయే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుతానికి ఈ వేరియంట్‌ను ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’ కేటగిరీలో పెట్టారు. అంటే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉన్నప్పటికీ, దీని వల్ల వచ్చే అనారోగ్యం స్వల్పంగా లేదా మధ్యస్థంగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, వృద్ధులు, గర్భిణీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సికాడా’ వేరియంట్ మునుపటి వేరియంట్ల కంటే భిన్నంగా ఉండటం వల్ల, ఇది టీకాలు తీసుకున్న వారిలో కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తత అవసరమని ప్రభుత్వం పేర్కొంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: