Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.

by CVR NEWS
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్ లో 1500 హీట్ డిగ్రీస్ వేడితో వెళ్తున్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో.. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. SMS -2, STC-3 హీట్ ఎఫ్ జీలో ప్రమాదం జరిగింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ప్రమాద సమయంలో CCD విభాగంలో 9 మంది కార్మికులు ఉండగా.. వారంతా మరణించినట్లు పోలీసులు, ఫైర్ సిబ్బంది గుర్తించారు. సమీపంలో ఉన్న మరికొందరు కార్మికులకు తీవ్రగాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించినట్లు తెలుస్తోంది. మృతుల్లో కాంట్రాక్ట్ కార్మికులు, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంటు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊహించని దుర్ఘటనతో స్టీల్ ప్లాంటులో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్థానిక మంత్రులను, యంత్రాంగాన్ని ఆదేశించారు సీఎం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ భరత్ పరిశీలించారు. నేరుగా ప్లాంట్ లోపలికి వెళ్లిన వారు.. ప్రమాదం జరిగిన తీరును అక్కడి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. గాయపడిన కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యుత్తమ, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ప్రమాద ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు తన సానుభాతిని ప్రకటించారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ద్రవం పడి సజీవ సమాధి అయిన 9 మంది కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌ 2 విభాగంలో సంభవించిన ఘోర ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్లాంట్‌ లోపల చిక్కుకుపోయిన ప్రతీ ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని అధికారులను కిషన్‌రెడ్డి కోరారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులకు,అత్యవసర వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: