Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు.

సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు.

by CVR NEWS
సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు

సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ… పండించిన పంటకు సరైన ధర రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో… మధ్యతరగతి రైతు తన వినూత్న ఆలోచనతో సరికొత్త విజయగాథను లిఖించారు. పంటను కేవలం పండించడమే కాదు… దానికి సాంకేతికతను జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు మోహన్ రెడ్డి నిరూపించారు. సోలార్ డ్రైయర్ యూనిట్‌ను ఏర్పాటు చేసి, తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడా అన్నదాత.

పంటలు పండించడం, మార్కెట్లో దళారుల చేతిలో మోసపోవడం మోహన్ రెడ్డిని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువగా పండుతుంది. అయితే, సీజన్ సమయంలో మార్కెట్లో మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలనుకున్న మోహన్ రెడ్డికి హార్టికల్చర్ శాఖ అధికారులు అండగా నిలిచారు. హార్టికల్చర్ అధికారులు సాగరిక, కోటేశ్వరరావు సూచనలు, సలహాలతో మోహన్ రెడ్డి తన పొలంలో ఒక సోలార్ డ్రైయర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు, అధికారుల సాంకేతిక సహాయంతో ప్రారంభమైన ఈ యూనిట్, ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

సాధారణంగా కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ సోలార్ డ్రైయర్ ద్వారా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలోని తేమను పూర్తిగా తొలగించవచ్చు. సూర్యరశ్మిని ఉపయోగించుకుని, ఎలాంటి రసాయనాలు లేకుండా, సహజసిద్ధమైన రంగు, రుచి, పోషక విలువలు కోల్పోకుండా వీటిని డ్రై చేస్తారు. ఇలా ఎండబెట్టిన ఉత్పత్తులు నెలల తరబడి పాడవకుండా నిల్వ ఉంటాయి. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మోహన్ రెడ్డి మామిడి పండ్లను నేరుగా తక్కువ ధరకు అమ్మకుండా… వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ప్రారంభించారు. సోలార్ డ్రైయర్ సహాయంతో మామిడి జామ్, సాంప్రదాయ తీపి తాండ్ర, సరికొత్తగా కారం తాండ్ర వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

రైతు మోహన్ రెడ్డి తన ఉత్పత్తులను మార్కెట్లో కిలో 200 నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. గతంలో పండ్లుగా అమ్మితే రాని లాభం, ఇప్పుడు ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వస్తోందని ఆయన చెప్తున్నారు. కేవలం మామిడి మాత్రమే కాకుండా, మార్కెట్లో కూరగాయల ధరలు పడిపోయినప్పుడు మోహన్ రెడ్డి వాటిని కొనుగోలు చేసి సోలార్ డ్రైయర్‌లో డ్రై చేస్తున్నారు. టమోటాలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, వివిధ రకాల ఆకుకూరలను డ్రై చేసి ఆకర్షణీయమైన ప్యాకెట్ల రూపంలోకి మారుస్తున్నారు. ఈ డ్రై చేసిన కూరగాయల ప్యాకెట్లను నాణ్యతను బట్టి 200 నుంచి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఎండిన కూరగాయలను వంటల్లో వాడుకోవడం సులువు కావడం… ప్రవాస భారతీయులు, పట్టణ ప్రజలకు ఇవి ఎంతగానో ఉపయోగపడటంతో వీటికి మార్కెట్లో భలే డిమాండ్ ఏర్పడింది.

మోహన్ రెడ్డి ఉత్పత్తుల నాణ్యత గురించి తెలుసి… ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. నాణ్యమైన, రసాయనాలు లేని పద్ధతిలో తయారు చేయడం వల్ల ఈ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ వస్తోంది. పంట పండించడమే కాకుండా, దానికి కాస్త సాంకేతికతను, వినూత్న ఆలోచనను జోడిస్తే రైతు ఎప్పటికీ నష్టపోడని మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు వస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. వాల్యూ ఎడిషన్ వైపు అడుగులు వేస్తే రైతులకు వ్యవసాయం ఎంతో లాభదాయకంగా మారుతుందని మోహన్ రెడ్డి తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: