ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని బిల్ట్ పరిశ్రమ. అజంజాహీ కంపెనీ తర్వాత అంత పెద్ద కర్మాగారం గా పేరొందింది బిల్ట్ పరిశ్రమ. లక్షల టన్నుల్లో కాగితపు గుజ్జు ఉత్పత్తి.. వేలాదిమంది కార్మికులకు ఉపాధి చూపించిన ఈ పరిశ్రమ మూతపడి పుష్కరకాలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ బిల్ట్ పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. బిల్ట్ గేట్లు మళ్లీ తెరుచుకుంటాయని ..మా కలలు నెరవేరతాయని ఆశగా ఎదురుచూస్తున్న కార్మిక కుటుంబాలపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం.
ప్రస్తుతం ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపూర్ లో 1975లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఈ పరిశ్రమను ఏర్పాటుచేసింది. 610 ఎకరాల్లో నెలకొల్పిన ఈ పరిశ్రమలో ఏడాదికి 90 వేల టన్నుల కాగితపు గుజ్జు ఉత్పత్తి అయ్యేది. ఒకప్పుడు వేయి మంది పర్మినెంట్ కార్మికులు, 20వేల మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేశారు. మరో 6 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందారు. బిల్ట్ పరిశ్రమలో ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జును గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేస్తుండేది. ఆ తర్వాత ఈ కంపెనీ సొంతంగా పరిశ్రమను నెలకొల్పింది. దీంతో 2014 ఏప్రిల్ లో బిల్ట్ కాగితపు గుజ్జు కొనుగోలును నిలిపివేసింది. దీనికి తోడు పల్ప్ కు మార్కెట్ లేక నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసి….పరిశ్రమను మూసేసింది. 2014 ఏప్రిల్ 6వ తేదీన నుంచి కార్యకలాపాలు నిలిచిపోయాయి.ఉద్యోగులు, కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. వారితో పాటు మండల వ్యాప్తంగా పరోక్షంగా మరో 10 వేల కుటుంబాలు, వ్యాపారులు సైతం ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోయారు. యంత్రాలు సైతం తుప్పుబట్టి…ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
ఓ పక్క కర్మాగారం పునఃప్రారంభం కోసం ఉద్యమిస్తున్న తరుణంలోనే కార్మికులు అ భద్రతా భావానికి గురై అనారోగ్యం పాలయ్యారు. కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదు. అప్పులు పెరగడంతో ఉన్నతంగా బతికిన కార్మికుల కుటుంబాలు చివరకు పిల్లలను చదివించలేని దీనావస్థలో ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. అనారోగ్యాలతో మృత్యువాత పడ్డారు. దీంతో సుమారు 46 మంది కార్మికులు బిల్ట్ ఉద్యమంలో అసువులు బాసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కనీసం కుటుంబం గడవటం కూడా కష్టంగా మారింది. 72 నెలలకుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు కార్మికులు. అనారోగ్యంతో సరైన వైద్యం అందక ఇప్పటి వరకూ సుమారు 40 మంది వరకు కార్మికులు చనిపోయారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాయితీలు ప్రకటించినా అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. బిల్ట్ పునరుద్ధరణకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి ఏళ్లు గడిచినా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రాలేదు.కార్మికులు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు.
ఇవాళ ఐదు వేల మంది కార్మికుల జీవితాలు కొడిగట్టాయి. కార్మికు ల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి దుస్థితి చూస్తుంటే మనకే ఏడుపు వచ్చే పరిస్థితి ఉంది. ఇపుడున్న మంత్రి ఈ పరిశ్రమ తెరిపిస్తారనే ఆశతో కార్మికులు ఉన్నారు.
నేడు రేపు అంటూ నోటి మాటలతో యాజమాన్యం కాలం వెళ్లదీస్తున్నారు కంపెనీ ముతపడటంతో ఏంచేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడా పని దొరకక మా ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
పదేళ్ల బిల్ట్ అవసానదశ కల్లారా చూసిన ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రి సీతక్క, యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఖాయిలా పడ్డ బిల్ట్‌ను పున: ప్రారంభించడం సాధ్యమయ్యే పని కాదు కనుక దాని స్థానంలో ఐటీసీ లేదా మరేదైనా కంపెనీలతో కొత్త పరిశ్రమను తెరిపించే అవకాశాలున్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.




Total views : 207700