రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను కేబినెట్ ముందుకు తీసుకురావడంతో పాటు… దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, పర్యాటకం తదితర రంగాల్లో 1 లక్షా 23 వేల 229 కోట్ల రూపాయల విలువైన 260 ప్రాజెక్టులు పీపీపీ విధానంలో పురోగతిలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణాన్ని కేంద్రం ప్రశంసించిందని… వాటికి 1,468 కోట్ల రూపాలయ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మంజూరవుతోందని తెలిపారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు కూడా కేంద్రం 178 కోట్ల వీజీఎఫ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రాజెక్టును ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడే సుస్థిర నమూనాలో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులను భాగస్వాములను చేసి వారికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని ఆదేశించారు. ప్రతి శాఖ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను రూపొందించి ఆదాయ వనరులను పెంచుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో బలహీన వర్గాల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి… రెసిడెన్షియల్ హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు.





Total views : 212498