నెల్లూరు జిల్లా వింజమూరులోని YR జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల ఆవరణలో వేడుకలు సందడిగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత బస్సుల్లో ప్రయాణించే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
ఉచిత పథకాలపై ఆధారపడటం కంటే పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపట్టాలని వెంకయ్య నాయుడు సూచించారు. ప్రభుత్వాలు ఉచిత పథకాల కంటే ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో సహాయం అందించాలని సూచించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.