National
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7న ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 7న తొలి దశ పోలింగ్, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మిజోరాంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 25న, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.
తమ ఐ ఫోన్లను హ్యకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐఫోన్ సంస్థ హెచ్చరిక మెయిల్ చేసిందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీ. వేణుగోపాల్, పవన్ ఖేడా, సుప్రీయా శ్రీనాథ్ లకు ఆపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. వీరితో పాటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శశిథరూర్, రాఘవ్ చద్దా, సీపీఎం నేత సీతారారం ఏచూరీలకు సైతం వార్నింగ్ మెయిల్ వచ్చిందన్నారు. విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు భయపడేది లేదన్నారు.
రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం గుజరాత్‌లోని కేవడియాలో పటేల్ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను చూడలేరు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారికి అండగా నిలబడేందుకూ వెనకాడరు. కొంతమంది రాజకీయ నేతలకు సానుకూల అంశాలు కనిపించవు. వారు దేశ ఐక్యత కంటే సొంత లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తారు అని విపక్షపార్టీలపై మోదీ మండిపడ్డారు. అలాగే త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అలాంటి నేతలు దేశాన్ని విభజించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటారని దుయ్యబట్టారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, అందుకోసం పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ. కశ్మీర్, దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370 గోడ కూలిపోయిందని, ఈ విషయంలో సర్దార్ ఎక్కడున్నా సంతోషిస్తారని అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్లో భారీ స్థాయిలో యూనిటీ డే పరేడ్‌ను నిర్వహించారు. సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది చేసిన విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా వారి ధైర్యసాహసాలను మోదీ అభినందించారు.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆమె మనవడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత ఆమె పార్థివదేహం వద్ద రాహుల్ గాంధీ కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలతోపాటు, ఇందిరాగాంధీ ప్రజలతో మమేకమైన సందర్భాలు, ఐక్యరాజ్యసమితిలో ఆమె ప్రసంగించేందుకు వెళుతుండటం వీడియోలో చూడొచ్చు. నానమ్మ నా శక్తి నువ్వే.. భారత్ కోసం నువ్వు సర్వస్వం త్యాగం చేశావు. ఈ దేశాన్ని నేను ఎప్పటికీ కాపాడుతుంటాను. నీ జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటకీ నాతోనే ఉంటాయి అని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శక్తి స్థల్లో ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు. శక్తిమంతమైన, ప్రగతిశీల భారత దేశాన్ని నిర్మించడంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆదర్శాలను పాటిస్తూ, ధైర్యంగా జీవిస్తూ.. న్యాయం కోసం పోరాటం చేయాలనేందుకు మీ జీవితం నిదర్శనం అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీ మరో మనవడు, భాజపా ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఆమెకు నివాళులు అర్పించారు. “ధైర్యానికి, పోరాటానికి ప్రతీక. ఓ వైపు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే సంకల్పం, మరోవైపు మాతృత్వంలో సున్నితత్వం. మీరు నిజంగా మదర్ ఆఫ్ ది నేషన్ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే ఈ సమన్లు జారీ అవ్వడం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో ఇదే విషయంపై సీబీఐ కూడా కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. అయితే గతేడాదే దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు. కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఇందుకోసం ఫేక్ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు. కాగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. హవ్డా-సికింద్రాబాద్ , ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హవ్డా-బెంగళూరు దూరంతో ఎక్స్‌ప్రెస్, షాలీమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ ప్యాసింజర్, తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇక భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌నూ రీషెడ్యూల్ చేశారు. నేటి ఉదయం 5:40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 10 గంటలకు వెళుతుందని చెప్పారు. రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ 2023, ఆగస్టు 23న చంద్రునిపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేయడం భారతదేశానికి ఇదే మొదటిసారి. ఇప్పటివరకు కేవలం మూడు ఇతర దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించగలిగాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపైకి ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకువెళ్లింది. ఈ రోవర్ జాబిల్లిపై వివిధ సైంటిఫిక్ ఎక్స్పరిమెంట్స్ చేసింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టే సమయంలో ల్యాండర్ చుట్టూ ‘ఎజెక్టా హాలో’ఏర్పడింది. అంటే ల్యాండర్ దిగిన ప్రదేశంలో గోతి ఏర్పడి, అక్కడి మట్టి పక్కకు జరిగింది. ఇది శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తిని రేపింది. ల్యాండింగ్ సైట్ చుట్టూ దుమ్ము, ధూళి బలంగా ఎగిరిపోయి అయిపోయి హాలో-షేప్డ్ పాటర్న్ ఏర్పడడాన్ని ఎజెక్టా హాలో అంటారు. విక్రమ్ ల్యాండర్ విషయానికొస్తే.. ఇక్కడ ల్యాండింగ్ ప్రభావం చంద్రుని పదార్థంలో కొంత భాగాన్ని విసిరేసి సమీపంలోని ప్రాంతంలో చెల్లాచెదురుగా చేసింది. జాబిల్లిపై ఉన్న ఈ మెటీరియల్‌ను ఎపి రెగోలిత్ అంటారు, ఇది చంద్రుని క్రస్ట్ పై పొర. ఇందులో రాళ్ళు, ధూళి ఉంటాయి. దీనిని మూన్ డస్ట్ అని కూడా పిలుస్తారు.
కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.
మలయాళ నటుడు, మాజీ ఎంపీ సురేశ్ గోపీ ఓ మహిళా జర్నలిస్టుతో వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సురేశ్ గోపీపై గతంలో పెద్దగా వివాదాలేమీ లేకపోగా, ఆయన తాజా ప్రవర్తన విస్మయం కలిగిస్తోంది. ఉత్తర కోజికోడ్ లో జరిగిన ఓ కార్యక్రమం సురేశ్ గోపీని మీడియా పలకరించింది. సురేశ్ గోపీ తనకు సమీపంలో నిల్చుని మైక్ పట్టుకుని ఉన్న మహిళా జర్నలిస్టు భుజంపై చేయి వేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె నవ్వుతూనే ఆయన చేయిని తొలగించారు. తర్వాత కాసేపటికి సురేశ్ గోపీ మరోసారి ఆమె భుజంపై చేయి వేశారు. ఆమె మళ్లీ ఆ చేతిని తీసివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సురేశ్ గోపీ తీరుతో ఆ పాత్రికేయురాలు ఇబ్బందిపడినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. దాంతో, సీనియర్ నటుడి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, సురేశ్ గోపీ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమెను తన కుమార్తెగా భావించి చనువుగా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు. వాత్సల్యంతోనే భుజంపై చేయివేశానే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా, ఆమె ఇబ్బంది పడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు.




Total views : 194111