హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. బిశ్వ శర్మతో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ వంటి కీలక నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ నేత రంజిత్ దాస్‌ను అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు సహా ఎన్డీయే కూటమికి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొని హిమంత బిశ్వ శర్మకు అభినందనలు తెలిపారు. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 102 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజయోత్సవ సభ అసోం అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని నేతలు కొనియాడారు.
National
నీట్ యూజీ-2026 కి సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. పరీక్షకు ముందు రాజస్థాన్‌లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్‌తో ప్రశ్నా పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిలో పలు రాష్ట్రాల నెట్‌వర్క్‌ల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూపు దర్యాప్తు చేపట్టింది. లీకేజీ వార్తలను నీట్ నిర్వహించిన జాతీయ పరీక్ష సంస్థ కూడా కొట్టిపారేయకపోవటం గమనార్హం. ఈ నెల 3న జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్, ఎస్ఓజీ అధికారులు వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే రూ.30 వేలకు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా? లేక ఎవరైనా పేపర్ లీక్ చేశారా? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈ నెల 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని.. ఆ తర్వాత అది పీజీ వసతిగృహాలు, కోచింగ్ నెట్‌వర్క్‌లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు.
తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్కూళ్లు, దేవాలయాలు, కాలేజీలకు దగ్గరలో ఉన్న మద్యం షాపులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులతో చర్చించారని త్వరలోనే అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో దేవాలయాలు, స్కూళ్లు మరియు కాలేజీలకు 100 మీటర్లు దూరంగా వైన్ షాపులు ఉండాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. దీంతో విజయ్ కొత్తగా నిర్ణయం తీసుకోవడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం హైప్ కోసమే విజయ్ కి చెందిన పీఆర్ టీమ్ ఇటాంటి లీకులు ఇస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల వైన్ షాపులు స్కూళ్లు, దేవాలయాలకు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు. కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా వాటిని ఏర్పాటు చేశారని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అవి తెరుచుకునే ఉంటాయని అంటున్నారు. దీంతో ఎక్స్ లో టీవీకే కార్యకర్తలు వర్సెస్ ప్రతిపక్షాల కార్యకర్తలు అన్న చందంగా ట్వీట్స్ వార్ నడుస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా కీలక అడుగు వేసారు. కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 24 గంటల్లోనే తన మార్క్ చూపిస్తున్నారు. మెజార్టీకి తక్కువగా సంఖ్యా బలం ఉండటంతో.. డీఎంకే మిత్రపక్షాలతో కలిసి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఎన్నికల ప్రచారంలో సవాళ్లు – ప్రతి సవాళ్లతో హెరెత్తించిన స్టాలిన్ – సీఎం విజయ్ ఈ రోజున రాష్ట్ర ప్రజలకు భిన్నంగా కనిపించారు. స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్ కు ఊహించని స్పందన ఎదురైంది. సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నే విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి మార్యాద పూర్వకంగా కలిసారు. ఇంటి వద్దకు వెళ్లగానే మాజీ డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సీఎం విజన్ ను ఆలింగనం చేసుకొని ఆహ్వానం పలికారు. స్టాలిన్ సైతం విజయ్ ను ఆలింగనం చేసుకుంటూ.. అభినందించారు. సక్సెస్ కావాలని ఆకాంక్షించారు
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది హీరో విజయ్ – హీరోయిన్ త్రిషల సన్నిహిత్యం. రాజకీయాలు, సినిమా, వ్యక్తిగత జీవితం అన్నీ కలిసిపోయిన ఈ చర్చ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. విజయ్ తొలిసారే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం… ఆ వేడుకకు త్రిష ప్రత్యేకంగా హాజరుకావడం… అభిమానులకు చేతులు ఊపుతూ కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. ఎంజీఆర్ – జయలలితల రాజకీయ, సినీ అనుబంధంతో పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో “తాను కూడా సీఎం అవుతాను” అని త్రిష చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. విజయ్ కుటుంబంతో త్రిష కలివిడిగా కనిపించడం… వరుసగా కలిసి పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం… భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలకు కారణమవుతోంది. పార్టీ పదవి లేదా ఉపఎన్నిక టికెట్ కూడా ఇవ్వొచ్చనే ప్రచారం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
విజయ్ – త్రిషల సంబంధంపై మొదట బహిరంగంగా వ్యాఖ్యానించి వివాదానికి తెరలేపింది తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్. “విజయ్ ముందుగా త్రిష ప్రభావం నుంచి బయటకు రావాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన త్రిష… వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం అసభ్యకరమని మండిపడ్డారు. అయినా ఆ వివాదం అక్కడితో ఆగలేదు. తర్వాత విజయ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో త్రిష కనిపించడం… ఎన్నికల అనంతరం విజయ్ కుటుంబ సభ్యులతో కూడా సన్నిహితంగా మెలగడం మరోసారి చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోలు వైరల్ అవుతుండటంతో అభిమానులు, రాజకీయ విశ్లేషకులు తమ తమ కోణాల్లో అర్థాలు వెతుకుతున్నారు. విజయ్ రాజకీయ భవిష్యత్తులో త్రిష కీలక పాత్ర పోషిస్తుందా? లేక ఇది కేవలం స్నేహమేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారాయి.
తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ప్రేమపై పోస్ట్ ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంది” అంటూ నీలిరంగు హార్ట్ ఎమోజీతో చేసిన పోస్ట్ అభిమానుల్లో కొత్త ఊహాగానాలకు కారణమైంది. ఇదే సమయంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో ఆమె భావోద్వేగానికి గురయ్యారనే ప్రచారం కూడా జోరందుకుంది. విజయ్‌తో కలిసి త్రిష నటించిన ఐదు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ సినిమాల సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అదే స్నేహం రాజకీయ చర్చలకు కేంద్రబిందువవుతోంది. ఎంజీఆర్ – జయలలిత మాదిరిగా విజయ్ – త్రిష జోడీ కూడా తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా? త్రిష రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెడతారా? అన్న ప్రశ్నలు రోజురోజుకూ బలపడుతున్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలేనా? లేక భవిష్యత్తు రాజకీయాలకు సంకేతాలా? అన్నది కాలమే నిర్ణయించాలి.
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అన్నాడీఎంకే భవిష్యత్తుపై భారీ చర్చ మొదలైంది. ఎడప్పాడి పళనిసామి నాయకత్వంపై సీనియర్ నేతల అసంతృప్తి బహిరంగంగా బయటపడటంతో పార్టీ చీలిక దిశగా వెళ్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి లాంటి బలమైన నేతలు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోవడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా విజయ్‌కు మద్దతు అంశం, శాసనసభా కమిటీ పదవులపై విభేదాలు పార్టీ అంతర్గత సంక్షోభాన్ని బయటపెట్టాయి. ఒకవేళ ఈ నేతలు వేరుగా వెళ్లినా… దాని వల్ల డీఎంకే వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో విజయ్ పార్టీకి రాజకీయ లాభం చేకూరొచ్చు. కానీ మరోవైపు చూస్తే… అన్నాడీఎంకేలో కొత్త నాయకత్వ మార్పు జరిగితే పార్టీకి కొత్త ఊపు రావచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. జయలలిత తర్వాత ఇప్పటికే బలహీనపడిన పార్టీ… మరోసారి వర్గపోరుతో దెబ్బతింటే భారీ నష్టం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలు కేవలం వ్యక్తిగత విభేదాలేనా… లేక పెద్ద రాజకీయ వ్యూహానికి సంకేతమా అన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గం దగ్గర ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉందన్న ప్రచారం ఈపీఎస్‌కు పెద్ద సవాలుగా మారింది. ఒకవేళ ఎమ్మెల్యేలతో కలిసి వేరే శక్తికేంద్రం ఏర్పడితే… పార్టీ అధికారిక గుర్తుపై కూడా వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఇదే సమయంలో విజయ్ సీఎం అవ్వడంతో అన్నాడీఎంకేలోని అసంతృప్త నేతలకు కొత్త ఆశగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. విజయ్‌కు దగ్గరవడం వల్ల సంప్రదాయ అన్నాడీఎంకే ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఈపీఎస్ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటే పార్టీ మరింతగా చీలిపోయే అవకాశముంది. కానీ రాజీ కుదిరితే మాత్రం డీఎంకేలకు ఎదురుగా బలమైన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే మళ్లీ నిలబడే అవకాశం కూడా పూర్తిగా కొట్టిపారేయలేం.
అయితే ఇప్పటికే ఐదేళ్లు అధికారానికి దూరమైన నేతలు మరో ఐదేళ్లు అధికారం లేకుండా ఉండే పరిస్థితి కనబడడం లేదు .విజయ్ తో చేతులు కలిపితే ఎలాగైనా అధికారంలో ఉన్నట్లేనని కొందరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది ,
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికర అంశంగా మారింది అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం. జయలలిత మరణం తర్వాత శశికళ, పన్నీర్‌సెల్వం, ఈపీఎస్ వర్గాలుగా విడిపోయిన పార్టీ… ఇప్పుడు మళ్లీ కొత్త చీలిక అంచున నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వంటి బలమైన ప్రాంతీయ నేతలు తిరుగుబాటు బాట పట్టడం ఈపీఎస్ నాయకత్వానికి పెద్ద హెచ్చరికగా మారింది. ఒకవేళ ఈ వర్గం విజయ్‌కు మద్దతుగా వెళ్లితే తమిళ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. యువ ఓటర్లలో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను ఈ నేతలు రాజకీయ బలంగా మార్చుకోవాలని చూస్తున్నారన్న ప్రచారం ఉంది. కానీ దీనివల్ల అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు ఈపీఎస్ కఠిన చర్యలు తీసుకుని నేతలను బహిష్కరిస్తే పార్టీ నిర్మాణమే దెబ్బతినొచ్చు. అయితే చివరి నిమిషంలో రాజీ జరిగితే… ఈ సంక్షోభం తర్వాత మరింత బలమైన నాయకత్వం వెలుగులోకి వచ్చే అవకాశమూ ఉందని రాజకీయ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి .
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నాలుగు కొత్త లేబర్ కోడ్లను పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 29 పాత చట్టాల స్థానంలో వచ్చిన ఈ కొత్త నిబంధనలు కార్మికుల పనితీరు, వేతనం, సామాజిక భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ మార్పుల వల్ల అటు కంపెనీలకు నిబంధనల సరళీకరణతో పాటు, ఇటు కార్మికులకు మెరుగైన హక్కులు కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. 2025 నవంబర్లోనే ఇవి చట్టాలుగా మారాయని, డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ చేసి భాగస్వాముల సూచనలు కోరారని ఓ అధికారి వివరించారు. వాటిని న్యాయ పరీక్ష చేసి తాజాగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో ఈ లేబర్ కోడ్ చట్టాల అమలుకు అవసరమైన ప్రక్రియ ముగిసిందని తెలిపారు. అయితే, కార్మిక శాఖ ఉమ్మడి జాబితాలో ఉండే అంశమని, అందుకే రాష్ట్రాలు కూడా నోటిఫై చేస్తే.. ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
కొత్త నిబంధనల ప్రకారం వారానికి పని గంటలను గరిష్టంగా 48 గంటలుగా నిర్ణయించారు. కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం తప్పనిసరి చేయడంతో పాటు, అదనపు సమయం పనిచేస్తే దానికి తగ్గట్టుగా ఓవర్ టైమ్ భత్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, పారదర్శకత కోసం ప్రతి ఉద్యోగికీ తప్పనిసరిగా నియామక పత్రం జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 40 ఏళ్లు దాటిన కార్మికులకూ ఏటా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, రాత్రి వేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యతను యజమానులకే అప్పగించారు.
ఈ మార్పుల వల్ల నెలవారీ చేతికి వచ్చే జీతంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొత్త వేతన నిబంధనల ప్రకారం.. ఉద్యోగి మొత్తం జీతంలో ప్రాథమిక వేతనం కనీసం 50 శాతంగా ఉండాలి. దీనివల్ల నెలవారీగా చేతికి అందే నగదు స్వల్పంగా తగ్గినప్పటికీ.. పీఎఫ్, గ్రాట్యుటీ వాటా పెరగడం వల్ల పదవీ విరమణ తర్వాత కార్మికులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు, ఇప్పటివరకు ఎలాంటి భద్రత లేని డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని నిబంధనలను ఖరారు చేసిన వెంటనే ఇవి క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నాయి.
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన ఆయన, పెరంబూర్ నియోజకవర్గాన్ని నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, రెండుచోట్ల గెలిచిన అభ్యర్థులు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకుని, పెరంబూర్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత, తమిళనాడులో ఏకకాలంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచిన నేతగా విజయ్ నిలిచారు.
కాగా, విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి వీసీకే పార్టీ అధినేత థోళ్ తిరుమావళవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీవీకే పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రావడంలో వీసీకే పార్టీ సహకారం కూడా ఉంది. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే పార్టీకి మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
బెంగళూరు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దాహంతో కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించిన మోదీ.. కాంగ్రెస్ ఇప్పుడు పరాన్నజీవిలా మారిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం పార్లమెంటులో కాంగ్రెస్ సంఖ్యాబలం 400కు పైనే ఉండేదని, కానీ గత మూడు ఎన్నికల్లో వారికి 100 సీట్లు కూడా రావడం లేదన్నారు.
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజా జీవితాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎక్స్ మీడియా వేదికగా ఆయన హామీ ఇచ్చారు.’తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు సి.జోసెఫ్ విజయ్‌కు అభినందనలు. ఆయన పదవీకాలం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సీఎం విజయ్‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే విజయ్‌కు, మంత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, పారదర్శకమైన, ప్రగతిశీలమైన పాలనను అందించి, రాష్ట్రాన్ని మరింత ప్రగతి వైపునకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ తెలిపారు.