అండమాన్ సముద్రంలో ‘ఆయిల్ ఇండియా’ సంస్థ కొత్త సహజ వాయువు నిక్షేపాలను కనుగొంది. అండమాన్ జలాల్లోని శ్రీవిజయపురం-3 బావిలో ఈ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్పసింగ్ పురి తెలిపారు. ఈ బావి అండమాన్ దీవులకు తూర్పు తీరాన 15 కిలోమీటర్ల దూరంలో, 900 అడుగుల లోతులో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడి బావిలో సహజ వాయువు ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఆ గ్యాస్ మిశ్రమంలో ఏయే వాయువులు ఎంత శాతం ఉన్నాయన్నది తేల్చడానికి నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. అండమాన్ బేసిన్లో ఆయిల్ ఇండియా చేపట్టిన చమురు అన్వేషణలో ఇది రెండో విజయమన్నారు. భారతదేశం చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం ఈ ఏడాది చివరికల్లా అండమాన్ రీజియన్‌లో మరిన్ని చమురు అన్వేషణ బావులను తవ్వాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది ఆయిల్ ఇండియాకు చెందిన శ్రీవిజయపురం-2 బావిలో గ్యాస్‌ను గుర్తించారు.
National
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూ ఉపరితలం నుంచి కేవలం 5 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు సెస్మిక్ డేటా వెల్లడించింది. తక్కువ లోతులో భూకంపం సంభవించడం వల్ల చంబా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొద్దిసేపు భయాందోళనలకు గురైనప్పటికీ, పరిస్థితి అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది. తక్కువ లోతులో వచ్చే భూకంపాలు తీవ్రత పరంగా మోస్తరుగా ఉన్నా, భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కర్నాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. పొన్నంపేట తాలూకాలోని కోణనకట్టే ప్రాంతంలో కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన రిటైర్డ్ ఐజీపీ కుటుంబ సభ్యులపై అడవి ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఐజీపీ భార్య తీవ్రంగా గాయపడి మృతి చెందారు.ఏనుగు దాడిని గమనించిన కార్మికులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అడవి జంతువుల సంచారంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
బెంగాల్లో అధికారం మారిన తర్వాత పరిస్థితి అత్యంత నాటకీయంగా మారిపోయాయి. ముఖ్యంగా మొన్నటి వరకు అధికారం చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు ఇటు ప్రజలు, అటు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కట్ మనీ పేరుతో ఇష్టారీతిగా మామూళ్లు వసూలు చేసిన తృణమూల్ నేతలు.. ఇప్పుడు జనం ధాటికి పరుగులు పెడుతున్నారు. కూచ్ బెహార్‌కు చెందిన ఆ పార్టీ నేత షహీదుల్ మియా పై పోలీసు కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా… వారి నుంచి తప్పించుకునేందుకు షహీద్ మంచం కింద దాక్కున్నారు. అయితే దీన్ని పోలీసులు గుర్తించడంతో.. ఆయనకు గత్యంతరం లేక లొంగిపోక తప్పలేదు. బయటకు రాగానే అతడిపై దాడి చేసేందుకు ప్రజలు దూసుకురాగా.. పోలీసులు వారించి అతణ్ని సురక్షితంగా పోలీస్ స్టేషన్ తరలించారు.
కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్‌కు ఆదిలోనే కుదుపు ఎదురైంది. ప్రమాణస్వీకారం చేసిన మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఇష్టం లేని శాఖను కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ రామలింగారెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగారు. నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని విన్నవించినా.. తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తంచేశారు. జూన్ 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. 13 మందితో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. అయితే, మంత్రుల్లో రామలింగారెడ్డి ఒకరు. శాఖ కేటాయింపుల విషయంలో అసంతృప్తితో ఉన్న ఆయన బెంగళూరులో మీడియా ఎదుట తన రాజీనామా లేఖపై సంతకం చేశారు. తాను ముఖ్యమంత్రిని ఏ శాఖ అడగలేదని… ఆయనే నాకు నగరాభివృద్ధి శాఖను ప్రతిపాదించారు… కానీ తర్వాత నీటిపారుదల శాఖను కేటాయించారు. అది తనకు ఆమోదయోగ్యం కాదన్నారు . అందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు రామలింగారెడ్డి స్పష్టం చేసారు. ఇక తాను ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తోనే ఉంటానని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాను బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అన్నామలై. దీనిపై కీలక ప్రకటన చేశారాయన. కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీని వీడటంపై వివరణ ఇచ్చారు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీచేయాలని ఆశించానని..కానీ అది జరగలేదని..అప్పటినుంచి బీజేపీతో విభేదాలున్నాయన్నారు అన్నామలై. బీజేపీకి తాను భారంగా ఉండాలనుకోవడం లేదని..అందుకే రాజీనామా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు.
ఇక కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అన్నామలై ప్రయత్నాలు చేస్తున్నారు. ‘తమిళగ మక్కల్ కళగం’ లేదంటే ‘తమిళగ మక్కల్ కట్చి’ అనే పేరుతో పార్టీని స్థాపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘వియ్ లీడర్స్’ అనే ట్రస్టును నిర్వహిస్తున్నారు. దీన్ని మరింత విస్తరించి రాజకీయ ఉద్యమంగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అన్నామలై..2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి, మోదీ పాలన స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరారు. అప్పటినుంచి తమిళనాడులో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా సేవలందించారు. పాదయాత్ర చేసి పార్టీ విస్తరణకు కృషి చేశారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. దీనిపై అసంతృప్తితో ఉన్న అన్నామలైను..అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన..పార్టీకి రాజీనామా చేశారు.
రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది. ఎస్-400 సుదర్శన్ సుదీర్ఘ శ్రేణి ఎయిర్‌డిఫెన్స్ సిస్టం రష్యా నుంచి నౌకలో భారత్‌కు వచ్చినట్టు తెలిపాయి రక్షణ శాఖ వర్గాలు. త్వరలోనే ఆపరేషన్ ఏరియాలో దీనిని మోహరించనున్నట్టు వెల్లడించాయి. భారత్ 2018లో 35 వేల కోట్లతో 5 స్క్వాడ్రన్ల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 3 స్క్వాడ్రన్లను రెండేళ్ల క్రితమే భారత్ అందుకుంది. నాల్గవది తాజాగా భారత్ చేరుకుంది. మరి కొద్ది నెలల్లోనే 5వ స్క్వాడ్రన్ కూడా భారత్‌కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ జరిపిన డ్రోన్, క్షిపణులను ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత సమర్ధవంతంగా కూల్చివేసింది. ఏకకాలంలో 300 లక్ష్యాలను ట్రాక్ చేసి, 40 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు క్షిపణులను, డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్లను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్ధవంతంగా తిప్పికొట్టగలదు. ఐతే భారత్ సైతం రష్యా సిస్టమ్ తరహాలోనే శత్రువిమానాలను కుప్పకూల్చే డిఫెన్స్ సిస్టమ్ ‘కుషా’ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది. దీని అభివృద్ధి, ఉత్పత్తిలో భాగస్వామిగా ఇండియన్ డిఫెన్స్ మేజర్ సోలార్ ఇండస్ట్రీలు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి. రష్యా నుంచి ప్రస్తుతం అందుకున్న ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్‌ను పశ్చిమబెంగాల్లో మోహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి భారత రాజ్యాంగంతో వచ్చిన డీకే శివకుమార్.. రాజ్యాంగ ప్రతిని చేతపట్టి.. పూజ్య గురువు గంగాధర్ ఆజ్య పేరున ప్రమాణం చేశారు. దీంతో కర్ణాటకకు 34వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి కేహెచ్ మునియప్ప కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సన్మానించారు డీకే శివకుమార్. అదే విధంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను కూడా కండువాతో సన్మానించారు. అంతకు ముందు ఆధ్యాత్మిక మత గురువుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు
సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారంతో.. గత కొంత కాలంగా కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చిత్తి తొలగినట్లయింది. గత రెండేళ్లుగా సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్న డీకేను ఇన్నాళ్లుగా ఓదార్చుతూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఎట్టకేలకు సిద్ధరామయ్యను తప్పుకోవాల్సిందిగా.. జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించింది. అధిష్టానం ఆదేశాలతో సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో డీకేకు మార్గం సుగమం అయ్యింది.
కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. వర్షాకాలం ముందస్తు సన్నాహాల్లో భాగంగా కాలేజీలో చేపట్టిన శుభ్రతా కార్యక్రమంలో ఈ నోట్ల కట్టల గుట్టు రట్టయింది. యూనియన్ గదిలోని ఒక పాత అల్మారాను తెరిచి చూడగా, అందులో రెండు సూట్‌కేసులు కనిపించాయి. ఆ సూట్‌కేసులను తెరిచిన సిబ్బంది, వాటిలో గుట్టలుగా ఉన్న 100, 500 కరెన్సీ నోట్లను చూసి షాక్‌కు గురయ్యారు.ఈ నోట్ల కట్టలు చాలా కాలంగా అక్కడ నిల్వ ఉండటం వల్ల వీటికి భారీగా చెదలు పట్టాయి. దాదాపు ఒక లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు విలువ చేసే నోట్లు పాడైపోయినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.ఆయుధాలు, మద్యం సీసాలు: నోట్ల కట్టలతో పాటు అదే గదిలో ఒక రివాల్వర్, ఖాళీ మద్యం సీసాలు కూడా లభ్యమవ్వడం సంచలనంగా మారింది.
ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది విదేశీ వలస పక్షుల సందడి ప్రారంభమైంది. దూర దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వలస పక్షులు గ్రామ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, వాగులు, పంట పొలాలను తమ తాత్కాలిక నివాసాలుగా మార్చుకుంటున్నాయి.
ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల గుంపులు ఆకాశంలో ఎగురుతూ చేసే శబ్దాలు గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. తెల్లబాతులు, కొంగలు, సైబీరియన్ రకాల పక్షులు, ఇతర అరుదైన జాతులకు చెందిన పక్షులు ఇక్కడ దర్శనమిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పక్షులు చెరువుల్లో చేపలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటూ ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వలస పక్షుల రాకతో గ్రామంలోని రైతులు, ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యువకులు ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే, పక్షులను భయపెట్టకుండా, వాటి సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా వలస పక్షుల సంరక్షణపై దృష్టి సారించాలని, వేట నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దర్శి నియోజకవర్గం భవిష్యత్తులో పక్షి వీక్షణ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీ వలస పక్షుల రాకతో ప్రకృతి అందాలకు మరో మణిహారంగా మారిందని చెప్పవచ్చు.






Total views : 197010