మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబై వీధుల్లో స్వయంగా ఆటోను నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.’భామ్లా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘పింక్ ఈ-రిక్షా’ కార్యక్రమాన్ని అమృత ఫడ్నవిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు మద్దతుగా ఆమె స్వయంగా ఆటోను నడిపారు.మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభించనుంది. ప్రస్తుతం అమృత ఫడణవీస్ ఆటోను నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
National
కారుణ్య నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాటి విషయంలో వివాహితురాలైన కుమార్తెను మినహాయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నియామకాలకు సంబంధించి కుటుంబ నిర్వచనంలో వివాహితురాలైన కుమార్తె భాగం కాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అర్హత ఉన్న కుమార్తెకు.. పెళ్లయిందన్న కారణాన్ని సాకుగా చూపి కారుణ్య నియామకాన్ని నిరాకరించడం సరికాదని బాంబే, కర్ణాటక హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు వెల్లడించింది. కారుణ్యం ఆధారంగా తనకు ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ లైసెన్స్ ఇప్పించాలంటూ ఒక మహిళా పిటిషనర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబ నిర్వచనం నుంచి వివాహితురాలైన కుమార్తెను పక్కనపెడుతూ 2019లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆమె సవాలు చేశారు. తనకు వివాహం జరిగినప్పటికీ.. దివ్యాంగురాలైన సోదరిని చూసుకుంటూ, తల్లితో కలిసి ఆ దుకాణాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. తల్లి మరణం తర్వాత ఆమె లైసెన్స్‌కు దరఖాస్తు చేయగా.. అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వ ఆదేశాలనే అలహాబాద్ హైకోర్టు సమర్థించగా.. ఆ తీర్పును సుప్రీం పక్కనపెట్టింది. ఆమెకు లైసెన్స్ నిరాకరిస్తూ జారీ చేసిన ఆదేశాలను తోసిపుచ్చింది. నాలుగువారాల్లో ఆమెకు లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై పార్టీని వీడుతూ రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరికు సమర్పించారు. ఐదు పేజీల సుదీర్ఘ లేఖలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తును వ్యతిరేకించడం మరియు పార్టీపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో పార్టీ రాజకీయ వ్యూహంపై అన్నామలైకి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి కొన్నాళ్లు నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పొత్తును పునరుద్ధరించడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపిక సహా అంశాలపైనా బీజేపీపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నారని వర్గాలు తెలిపాయి.
పొత్తులపై ఆధారపడటం కంటే రాష్ట్రంలో ఒక స్వతంత్ర సంస్థాగత పునాదిని నిర్మించుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టాలని అన్నామలై వాదించినట్లు తెలుస్తోంది. కానీ, జాతీయ నాయకత్వం విస్తృతమైన డీఎంకే వ్యతిరేక వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చిందని సమాచారం. ఎన్నికల్లో దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే పనితీరు తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందని, కొత్త రాజకీయ శక్తులకు ఆస్కారం కల్పించాయని ఆయన సహచరులు పేర్కొంటున్నారు.
పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం చెలరేగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి, పార్టీ అంతర్గత పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలిచిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మంది మాత్రమే హాజరవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఇది పార్టీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. మరోవైపు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో జూన్ 1న ఇద్దరు ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అసంతృప్తి మరింత పెరిగింది. టీఎంసీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ మంత్రి తపస్ రాయ్ మాట్లాడుతూ, టీఎంసీ చీలిక దిశగా పయనిస్తోందని, అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. పార్టీని కొందరు హైజాక్ చేశారని బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కోల్‌కతాలో తన పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మమతా బెనర్జీ భారీ ధర్నా నిర్వహించారు. “నేను పోరాడతాను లేదా చస్తాను” అని తేల్చి చెప్పారు. తమ పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానంతో చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సిద్ధరామయ్య, డీకేలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో నేడు సీఎంతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి విడతలో ఎవరు ఉంటారనేది ఖరారైనట్టు వెల్లడించాయి. మరో వారం పది రోజుల వ్యవధిలోనే క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు హాజరుకానున్నారు. సాయంత్రం 4:05 గంటలకు కర్ణాటక శాసనసభ ప్రాంగణంలో లేదా లోక్ భవన్లో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, కార్యక్రమం సజావుగా సాగేలా చూడటం కోసం కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3న విధాన సౌధ, వికాస సౌధ, బహుళ అంతస్తుల భవనాలలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి హాఫ్ డే సెలవు ప్రకటిస్తూ గవర్నర్ పేరు మీద సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్ ఘాట్స్ సమీపంలోని బద్రీనాథ్ మార్గం అలాగే కేదార్‌నాథ్‌కు దారితీసే సోన్ ప్రయాగ్ వంటి కీలక మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వరకు 25 నుండి 30 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో యాత్రికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. సరైన ఆహారం, నీళ్లు లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ వివరాలను తెలుసుకొని అంతుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కాగా, యాత్రికులకు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, యాత్రా మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది. భారీ దుమ్ము కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. సోషల్ మీడియాలో దుమ్ము తుపాను సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి.
వీధుల గుండా బలమైన ఈదురుగాలులు, దట్టమైన దుమ్ము మేఘాలు కనిపించాయి. దీంతో ఆకాశం ముదురు నారింజ-గోధుమ రంగులోకి మారిపోయింది. ఒక్కసారిగా ఇసుక తుపానుతో ప్రయాణికులు స్థానికులు ఇళ్లలోనే ఆశ్రయం పొందారు. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రాంతంలో తీవ్రమైన ఎండల తర్వాత బలమైన గాలులు, దుమ్ము తుపానులు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎడారి వేడి గాలులు పరస్పరం చర్య జరిపినప్పుడు.. ముఖ్యంగా రుతుపవనాల ముందు వచ్చే ముందు రాజస్థాన్‌లో ఇటువంటి దుమ్ము తుపానులు సహజమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇసుక తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో అనవసరమైన ప్రయాణాలను చేయొద్దని.. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, దుమ్ము లేచే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో సైబర్ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంపై కొందరు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ జవాబు పత్రాలు తారుమారయ్యాయని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేయడంతో, విద్యార్థులకు స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీలు అందించి రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించింది బోర్డు. అయితే రీవాల్యుయేషన్ ఫీజుల చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్న పోర్టల్‌పైనే సైబర్ దాడి జరగడంతో చెల్లింపుల్లో తీవ్ర అవకతవకలు కనిపించాయి. సాధారణంగా చెల్లించాల్సిన ఫీజుకు బదులుగా కొందరికి 68 వేల రూపాయల వరకు వేర్వేరు మొత్తాలు చూపించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సమస్య ప్రధానంగా హెచ్డీఎఫ్సీ పేమెంట్ గేట్‌వేతో అనుసంధానమైన వ్యవస్థలోనే తలెత్తినట్లు వెల్లడించారు. ఘటనపై అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు చేపట్టగా, సాంకేతిక సమస్య పరిష్కారానికి ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.మరోవైపు ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానానికి సంబంధించి మొత్తం 20 జవాబు పత్రాలు తారుమారైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంగీకరించాయి. బాధిత విద్యార్థులను సంప్రదించి సరైన జవాబు పత్రాలను అందించినట్లు తెలిపాయి.దాదాపు 98 లక్షల జవాబు పత్రాలకు సంబంధించిన 40 కోట్లకు పైగా పేజీలను స్కాన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో సుమారు 68 వేల పత్రాల్లో నాణ్యత సమస్యలు గుర్తించడంతో వాటిని మళ్లీ స్కాన్ చేసినట్లు వెల్లడించారు.
కర్ణాటకలో సీఎం పీఠం మార్పునకు రంగం సిద్ధమైంది. కర్ణాటక సీఎల్పీ నేతగా.. డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను పరమేశ్వర బలపరిచారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు తెలపడంతో ఆయనే సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో.. కొత్త సీఎంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు.
ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, అధిష్ఠానం ఆదేశాల మేరకు డీకే శివకుమార్ బాధ్యతలను చేపట్టబోతున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో ఉన్న గ్లాస్ హౌస్‌లో జూన్ 3వ తేదీన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరగనుంది. మొదట రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ, నగరంలో ట్రాఫిక్ సమస్యలు, ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
డీకే శివకుమార్‌తో పాటు మరికొందరు మంత్రులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళం సీఎం సతీశన్, సహా కాంగ్రెస్ పెద్దలు హాజరు కానున్నారు.
భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన పలు కీలక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల వెల్లడి, వాటి అప్లోడింగ్లో జరుగుతున్న సుదీర్ఘ ఆలస్యంపై దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా సుమున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం.. హైకోర్టులు తాము రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల లోపు తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజు ఇవ్వాలని, ఒకవేళ ఆర్డర్‌ను రిజర్వ్ చేస్తే మరుసటి రోజే దానిని కచ్చితంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను తక్షణమే ట్రయల్ కోర్టులకు సమాచారం అందించాలని, బెయిల్ పొందిన విచారణ ఖైదీలను అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, అదే రోజు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యాయస్థానాలు తీర్పులను ప్రకటించిన 24 గంటల లోపు వాటిని ఆయా హైకోర్టుల అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా, ఒక తీర్పులోని ప్రధాన కార్యాచరణ భాగాన్ని ప్రకటించిన తేదీనే, ఆ తీర్పు వెల్లడించిన పూర్తి తేదీగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. వేలాది మంది ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించే ప్రాథమిక సంస్థలు హైకోర్టులేనని, అందువల్ల సకాలంలో తీర్పులు ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అయితే, ఈ మార్గదర్శకాలు ఏ ఒక్క వ్యక్తిగత న్యాయమూర్తిని, వ్యవస్థను ఉద్దేశించి చేసిన విమర్శలు కావని కోర్టు స్పష్టం చేసింది.




Total views : 197180