రంగారెడ్డి జిల్లాలో అక్రమ వెంచర్లకు అంతే లేకుండా పోయింది. సీలింగ్ భూమి, ప్రభుత్వ భూమి, చెరువులు, కుంటలు అన్న తేడా లేకుండా కంటికి కనిపించిన స్థలాలను కబ్జా చేసి.. వెంచర్లు వేసేస్తున్నారు. అరచేతిలో స్వర్గం సృష్టించి, కల్లబొల్లి కబుర్లు చెప్పి అమాయకులకు ప్లాట్లు అమ్మేస్తున్నారు. ఇలా కొనుక్కున్న వారు ఆ తర్వాత జరిగే పరిణామాలకు తీవ్రంగా నష్టపోతున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, కడ్తాల్ మండలాల్లో ప్లానెట్ గ్రీన్, పామ్ నాచురా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇదే తరహాలో ప్రజలను బురిడీ కొట్టించాయి. యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి వందల కోట్లు స్వాహా చేశాయి..
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలోని సర్వే నెంబర్లు 90 నుంచి 100, 108 లో గల భూములను కేశంపేట్ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి… ఎన్నారైల డబ్బులతో కొనుగోలు చేశారు. అనంతరం వెంచర్ డెవలపింగ్ కంపెనీ అయినా ప్లానెట్ గ్రీన్ కు కొంత భూమిని అప్పగించారు. ఈ సంస్థ యజమాని వినయ్ రామ్ మరో అడుగు ముందుకేసి.. డెవలపింగ్ పేరుతో అక్కడ ఉన్న రెండు చెరువులను మూసివేసి ఫీడర్ ఛానళ్లను కబ్జా చేసి రోడ్లు వేశారు. అలాగే రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు గ్రామాల సరిహద్దు ప్రాంతంలోని అసైన్, సీలింగ్ భూములను కబ్జా చేశారు. అంతేకాదు కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని సర్వే నెంబర్ 600 లో ఉన్న సీలింగ్ భూమిని కబ్జా చేసి అందులో నుంచి రోడ్డు వేశారు. అలాగే కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామం సర్వేనెంబర్ 108/3 లోని అసైన్ భూమిని కూడా కబ్జా చేశారు.
ఇదంతా రహస్యంగా, గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారమేమీ కాదు. బహిరంగంగా అందరి కళ్ల ముందే జరుగుతున్న భారీ దోపిడీ. అయినా రెవెన్యూ అధికారులు గానీ ఇరిగేషన్ అధికారులు గానీ, HMDA, DTCP అధికారులు గానీ స్పందించడం లేదు. ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో ప్లానెట్ గ్రీన్ సంస్థ డెవలప్ చేసిన వెంచర్లకు కనీసం రోడ్డు మార్గం కూడా లేదు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ యజమాన్యాలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..