ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించారు. గ్రూప్ దశలో భాగంగా జరిగిన ఒక కీలక మ్యాచ్‌లో, టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ వర్మ నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో తిలక్ వర్మకు కాంగ్రెస్ సర్కార్ నుంచి భారీ బహుమతి లభించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్‌కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Sports
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్‌కు BCCI గుడ్ న్యూస్ చెప్పింది. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీకి ప్రారంభం కానుంది. మొదట మార్చి 26వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. కానీ పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమైంది. అయితే ఎన్నడూ లేని విధంగా సరికొత్తంగా ఈ సీజన్‌కు తెరలేవనుంది. ఈసారి రెండు గ్రూప్‌ల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి 20 మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 12 వరకు ఇవి కొనసాగనున్నాయి. మార్చ్ 28న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుండగా.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 లకు RCB, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. సెకండ్ మ్యాచ్ మార్చ్ 29వ తేదీన ముంబై వేదికగాKKR వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది. మొదటి దశ షెడ్యూల్లో ఆడే 10 జట్లు, తలో నాలుగు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి.
ధనాధన్ క్రికెట్ పండుగ ముగిసింది. కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమ్ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన, ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. తద్వారా 2024లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టుకుని, పొట్టి ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, ఇషాన్ కిషన్ అర్థ శతకంతో చివర్లో హార్దిక్ పాండ్య, శివమ్ దూబే మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో, అక్షర పటేల్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డి విరవగా, కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. 2024 తర్వాత వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో భారత్‌కు తొలి మేజర్ ఐసీసీ ట్రోఫీని అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నారు.
ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలువురు ప్రముఖులు టీమ్ఇండియాకు అభినందనలు తెలిపారు. “ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం” అని క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల జయజయధ్వానాల మధ్య భారత్ ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించి, విశ్వవిజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ భారత్‌కు దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా భారత్ మూడు టీ20 ప్రపంచకప్‌లు సాధించడం గమనార్హం.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్ సంజూ శాంసన్ వీరోచిత ప్రదర్శన చేశారు. 46 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఆ తర్వాత అభిషేక్, ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో నీషమ్ మూడు, రచిన్ రవీంద్ర, హెన్రీ ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తమ పదునైన బౌలింగ్‌తో ఆరంభంలోనే వికెట్లు తీశారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, భారత బౌలింగ్ ధాటికి నిలవలేక ఓటమిని అంగీకరించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫెర్ట్ (52), కెప్టెన్ శాంట్నర్ (43) తప్ప ఎవరూ రాణించలేదు. మొత్తంగా 19 ఓవర్లలో 159 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు, అక్షర్ మూడు, వరుణ్, హార్దిక్, అభిషేక్ తలో వికెట్ తీశారు.
విజయం ఖరారైన క్షణంలో స్టేడియం మొత్తం బాణసంచా వెలుగులతో, ‘చక్ దే ఇండియా’ నినాదాలతో హోరెత్తిపోయింది. రోహిత్ శర్మ నుండి సారథ్య బాధ్యతలు స్నేహపూర్వకంగా అందుకున్న సూర్యకుమార్ యాదవ్, తన మొదటి మేజర్ టోర్నీలోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి రికార్డు సృష్టించారు. “ఇది జట్టు సమిష్టి కృషి. ఆటగాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛే ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ కప్పు దేశ ప్రజలందరికీ అంకితం” అని గెలుపు అనంతరం భావోద్వేగంతో కెప్టెన్ సూర్య వ్యాఖ్యానించారు. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుని, పొట్టి ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ఇండియా మూడోసారి ట్రోఫీని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా మూడు టైటిళ్లను గెలుచుకోలేదు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత భారత్‌కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ, ఆఖరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ , కెప్టెన్ బట్లర్ , హ్యారీ బ్రూక్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో జాకబ్ బెతెల్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అతనికి విల్ జాక్స్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా, శివమ్ దూబే బౌలింగ్ కు దిగాడు. మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది. మొత్తమ్మీద ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శివమ్ దూబే దూకుడుగా ఆడగా, చివర్లో తిలక్ వర్మ , హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా, జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. ఇక, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా…. న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టైటిల్ సమరం మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్’లో వెల్లడించారు. ఓ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన పీవీ సిందు..యుద్ధం కారణంగా రెండ్రోజుల నుంచి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. అక్కడ తాను క్షేమంగానే ఉన్నట్టు రెండ్రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే..గల్ఫ్ కంట్రీస్‌లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగానే ప్రత్యేక విమానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు చేరుకుంటున్నారు భారతీయులు.
టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. వెస్టిండీస్ సెమీస్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీస్‌కు చేరింది. భారత జట్టు బ్యాటర్లలో సంజూ శాంసన్ (97), సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా(17), శివమ్ దూబే(8)తో రాణించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ రెండు వికెట్లు, అకేల్ హోసేన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (40), జాసన్ హోల్డర్ (37*), రోమన్ పావెల్ (34*), షై హోప్ (32), షిమ్రాన్ హెట్మయెర్ (27), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (14) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2.. హార్దిక్, వరుణ్ తలో వికెట్ తీశారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. పక్కా వ్యూహంతో బరిలోకి వచ్చిన సౌతాఫ్రికా జట్టు.. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం అయింది. సూపర్-8లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా 76 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(0), అభిషేక్ శర్మ(15), తిలక్ వర్మ(1), సూర్యకుమార్(18), సుందర్(11), హార్దిక్ పాండ్యా(18), రింకూ సింగ్(0) పరుగులు చేశారు. శివమ్ దూబే 42 పరుగులతో చివరి వరకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 18.5 ఓవర్లు ఆడిన భారత్ 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో మైక్రో జాన్సన్ 4, కేవవ్ మహరాజ్ 3, కార్బిన్ 2, మార్కరమ్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (63) హాఫ్ సెంచరీ సాధించగా.. డేవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ 44 పరుగులు నాటౌట్ తో దూకుడుగా ఆడేశారు. మార్క్రమ్ (4), క్వింటన్ డికాక్ (6), రియాన్ రికెల్టన్ (7) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 3, అర్ష్‌దీప్ 2.. శివమ్ దూబె, వరుణ్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 20 పరుగులు ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ డకౌట్ అవ్వడంతో, ఈ టోర్నీలో అతను వరుసగా మూడోసారి సున్నాకే పెవిలియన్ చేరినట్టయింది. అంచనాల భారమే 25 ఏళ్ల అభిషేక్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని, అతను భారీ షాట్ల కోసం తొందరపడకుండా క్రీజులో సమయం గడపడంపై దృష్టి పెట్టాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. వరుస వైఫల్యాలతో, టీ20 ప్రపంచకప్‌ల చరిత్రలో భారత్ తరఫున అత్యధిక డకౌట్లు నమోదు చేసిన ఆశిష్ నెహ్రా సరసన అభిషేక్ నిలిచాడు. స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ, అభిషేక్ మంచి ఆటగాడే, కానీ అంచనాలు అతనిపై భారం మోపుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి బంతికే బౌండరీ లేదా సిక్స్ కొట్టాలని ప్రయత్నించకూడదని, భారీ షాట్లు వాటంతట అవే వస్తాయనీ, బలవంతంగా ఆడకూడదంటూ విశ్లేషించాడు.
అమెరికాపై గోల్డెన్ డక్‌తో మొదలైన అభిషేక్ వైఫల్యం, పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లలోనూ పునరావృతమైంది. ప్రతీసారి ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ముందు ఒక పరుగు తీసి ఖాతా తెరవాలి. నాలుగైదు బంతులు డాట్ అయినా ఫర్వాలేదు, తర్వాత కవర్ చేయొచ్చు. కాస్త క్రీజులో కుదురుకుంటే, అతని సహజమైన ఆట అదే బయటకు వస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే, అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ధీమా వ్యక్తం చేశాడు. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్, కోలుకున్న తర్వాత నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడని తెలిపాడు. నెట్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని… త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడన్నారు.. సూపర్ 8 దశ నాటికి అతను కీలకంగా మారతాడని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కీలకమైన సూపర్ 8 దశకు ముందు అభిషేక్ తిరిగి లయ అందుకోవాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో శివమ్ దుబే ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. బ్యాటింగ్‌లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గ్రూప్-ఏలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి, ఓటమన్నదే లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టనుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ వేగంగా ఆడాడు. ఆ తర్వాత తిలక్ వర్మ , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించారు. అయితే, అసలు సిసలు విధ్వంసం సృష్టించింది శివమ్ దూబేనే. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు.
194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ గట్టిగానే పోరాడింది. బాస్ డి లీడ్ , కోలిన్ అకెర్మాన్ , జాక్ లయన్-కాచెట్ రాణించారు. అయితే, భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే బంతితోనూ రాణించి 2 వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తద్వారా 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచింది. సూపర్-8లో గ్రూప్-1లో ఉన్న భారత్… ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్ తో తలపడనుంది.
ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్ నిర్వహించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. విద్యార్థులు, యువతీ, యువకులు సీఎం కప్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్‌లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సీఎం కప్‌ను పాఠశాల విద్యనుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.