తిరుమల అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడుతుంది. ఎనిమిది గంటలకు పైగా ఆలయం తలుపులు టిటిడి అధికారులు మూసి వేయనున్నారు. 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా 28న రాత్రి 7:05 గంటలకు టీటీడీ అధికారులు ఆలయం మూసివేస్తామన్నారు. తిరిగి గ్రహణం విడిచాకా అక్టోబరు 29 తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం రద్దు చేశామన్నారు.
చంద్రగ్రహణం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు. కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు, రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకముగా గ్రహణ కాలాభిషేకం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ కాలాభిషేకంలో పాల్గొనడానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు.
నిర్మల్ జిల్లా బాసర ఆలయంపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్ పడింది. బాసరలో చంద్రగ్రహణం సందర్బంగా అమ్మవారి ఆలయంతో పాటు, అన్ని ఉప ఆలయాలను ఆలయ అధికారులు మూసి వేశారు. వేద పండితులు, ఆలయ ఆర్చకులు రేపు ఉదయం సంప్రోక్షణ, హారతి సమర్పిస్తారు. అనంతరం యధావిధిగా భక్తులకు నాలుగు గంటల నుండి సర్వదర్శన సేవలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం గుడి తలపులు మూయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నేడు మూతపడనుంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. 29 న ఉదయం 8 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఈ గ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. శనివారం రాత్రి ఆలయాలు తలుపులు మూయనున్నారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తలుపులు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.