Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana పార్టీ మార్పుపై పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్.

పార్టీ మార్పుపై పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్.

by CVR NEWS

బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ చెక్ డ్యామ్ వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఏ మంత్రి పదవి కోసమో లేదా డబ్బు కోసమో కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మోసం చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని, కేవలం నియోజకవర్గంలోని కొంతమంది దౌర్భాగ్యుల వల్ల, నాటి పరిస్థితుల ప్రభావం వల్లనే పార్టీ మారాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ జెండాను కాదని, కేవలం జాతీయ జెండానే కప్పుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని పోచారం ఆరోపించారు. తాను కాంగ్రెస్‌లో చేరే సమయంలో నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులను, సిద్ధాపూర్ రిజర్వాయర్ వంటి ప్రాజెక్టుల బిల్లులను ఆరు నెలల్లోగా పూర్తి స్థాయిలో మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే పార్టీ కండువా కప్పుకున్న తర్వాత సగం నిధులు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని, బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులన్నీ నిలిపివేశారన్నారు. నిధుల కోసం అడిగితే స్పందన కరువైందని వాపోయారు.

నేను నీకు అమ్ముడుపోయానా లేక నా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని గత నవంబరులోనే సీఎంను సూటిగా నిలదీసినట్లు వెల్లడించారు. సీనియర్ నేతనైన తాను నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం, నిధుల విడుదల కోసం సీఎంకు, మంత్రులకు పలుమార్లు ఫోన్ చేసినా కనీసం కాల్స్ కూడా ఎత్తడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటేనే జీవోలు వచ్చే స్థితి నుంచి నేడు నిధుల కోసం దేవురించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందని పోచారం ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో 90 శాతం మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తన వెంట వచ్చారని, అదంతా కేవలం అభివృద్ధి కోసమేనని తెలిపారు. అయితే హామీలు నెరవేర్చకపోవడం వల్ల కిందిస్థాయి శ్రేణులకు జవాబు చెప్పుకోలేకపోతున్నానని తెలిపారు. పోచారం అసంతృప్తి తెలంగాణ రాజకీయాల్లో హైలెట్‌గా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: