తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాల అంశంపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. దొంగ, పోలీస్ ఆట ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌పై మండిపడ్డారు. కేంద్రాన్ని బద్నాం చేసేందుకే బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జీఆర్‌ఎంబీ అన్యాయం చేస్తోందంటూ ముట్టడి చేస్తామని ప్రకటించడం అనవసరమైన రాద్ధాంతమేనన్నారు. వచ్చే నెల 18న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇరిగేషన్ అధికారులతో జీఆర్‌ఎంబీ సమావేశం ఉందని.. ఇప్పటివరకు సమావేశం ఎజెండా కూడా ఖరారు కాలేదని తెలిపారు.
టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చిన తర్వాత వాటిని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రాసిన లేఖలపై పరస్పర అభిప్రాయాలు కోరిన జీఆర్‌ఎంబీ.. అందుకే ‘ప్రపోజ్డ్ ఎజెండా’గా పేర్కొందన్నారు. తెలంగాణకు నీళ్లు అందించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు ఇచ్చిందని.. దోచుకోవడానికి అనుమతులు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ఎంపీలుగా పనిచేస్తున్నామని తెలిపారు.
బీజేపీని తెలంగాణలో బద్నాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. తెలంగాణకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు వస్తున్నాయని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను ప్రజల ముందు పెడతామని సవాల్ చేశారు.దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు వస్తుండగా.. హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ ట్రైన్లు నడవనున్నాయని రఘునందన్ రావు పేర్కొన్నారు.